ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, బతుకమ్మ : ఏళ్లుగా బీసీల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రదంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కులగణనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఈ నెల 6నుంచి చేపట్టబోయే కులగణన చరిత్ర తిరగరాస్తుందని అన్నారు. తెలంగాణను మోడల్ గా తీసుకుని జనవరి నుంచి కేంద్రం సెన్సెస్ ను చేపట్టాలన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎక్కడ ఉన్నాయో తెలియదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన ఆధారంగానే జరుగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిందని అన్నారు. ఈ నెల 6నుంచి చేపట్టే కులగణన సర్వేను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు తగిన న్యాయం జరగాలని అన్నారు. కుల గణన కార్య్రక్రంలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్వేకు వచ్చే అధికారులకు సహకరించాలని కోరారు. దేశంలో కులగణన చేపట్టే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని ఒక మహోన్నత కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవన, వైవిద్య అంశాలను సర్వే ద్వారా తీసుకుని అందరికీ లబ్ది చేకురే విధంగా కార్యాచరణ ముందుకు సాగుతుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ సంస్కరణ చట్టం, ఎంజీఎన్ఆర్జీఎస్ చట్టం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామజిక,ఆర్థిక ప్రయోజనాలు సమాకుర్చాలానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల నాయకత్వంలో మరింత పటిష్టం చేసే పక్రియ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు బీసీలకు 52% శాతం కావాలని మాట్లాడిన ఇటీవలే నిర్వహీంచిన అన్ని పరీక్షల ఫలితాల్లో 57%శాతం బీసీ లకు రావడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు, అన్నికులాలను సమదృష్టితో పరిపాలిస్తుందని తెలిపారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో 2021లో జరగాల్సిన కులగణన ఇంత వరకు నిర్వహించిలేదని అన్నారు. పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒత్తిడి తో 2025లో కుల, జన గణన ఉంటుందని తెలిపారు. రాజ్యాంగన్ని నిర్వీర్యం చేసే పక్రియలో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే పక్రియను కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
