బతుకమ్మ, పోతంగల్ : మండలం లోని సుంకిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా బాసర దేవాలయం, బాసర ఐఐఐటీ, అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మొదటగా బాసర జ్ఞానసరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించి, విద్యా విధానం, సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించారు. తదనంతరం అంకాపూర్ గ్రామంలోని గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ద్వారా విద్యార్థులు తమ అభ్యాసంలో కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు ప్రాక్టికల్ అవగాహన పొందారని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు శాస్త్రీయ, సాంస్కృతిక, సామాజిక విషయాలపై అవగాహన పెంచేందుకు విజ్ఞాన యాత్ర తోడ్పడుతుందని, ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి,గంగాధర్, సుధాకర్ సాయిరెడ్డి, లావణ్య , విద్యార్థులు పాల్గొన్నారు.

