25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పరీక్షలంటే అంటే పరేషాన్ వద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రణాళికతో చదివితే  పక్క అద్భుత ఫలితాలు..
  • తెలంగాణ ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : పరీక్షలు అంటే విద్యార్థులు పరేషాన్ కావద్దని, ప్రణాళిక ప్రకారం చదివితే విద్యార్థులు కలలు గన్న అద్భుత ఫలితాలను సాధించవచ్చని తెలంగాణ ఐ కే పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ ఉద్బో దించారు. ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో ఐకెపి మహిళలతో అన్ని పాఠశాలలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి విధితమే కాగా ఈ క్రమంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న ఈ తరుణంలో పరీక్షలు అంటే భయం పోగొట్టి వారిలో ఉత్సాహాన్ని నింపుతూ స్ఫూర్తిని రగిలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐకెపి ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్ పల్లి మం. ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ రెడ్డి చే ప్రత్యేక మోటివేషన్ క్లాస్ నిర్వహిస్తూ పలు విలువైన సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని కొనసముందర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడుతూ అసైన్మెంట్ పరీక్షలు, ఆఫ్ ఇయర్లీ , ప్రీ ఫైనల్ క్వార్టర్ ఫైనల్ వంటి పరీక్షల పేరుతో ఇదివరకే పదవ తరగతిలో 9 రకాల పరీక్షలను విద్యార్థులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి కేవలం ఆ తదుపరి నిర్వహించే మరో పరీక్ష మాత్రమేనని విద్యార్థులకు గుర్తు చేశారు. పరీక్షలు అంటే భయాన్ని ప్రతి ఒక్కరు వదులుకోవాలని సిలబస్ లో ఉన్న అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయని అలాంటప్పుడు భయపడడంలో అర్థం లేదని అన్నారు. ఈ క్రమంలో దయ్యాలు భూతాలు వంటి అతి ఇంద్రియ శక్తుల పేరుతో జరిగే ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని,  ఇంతవరకు ఎవరు కూడా అతింద్రియ శక్తులను చూసింది లేదని ఈ పరీక్షలు అంటే భయం కూడా ఆకోవకే చెందుతుందని వివరించారు. పరీక్షలపై సంపూర్ణ అవగాహన కోసం గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం నిర్వహించిన పబ్లిక్ పరీక్షల యొక్క పేపర్లను మోడల్ పేపర్లుగా పరిశీలించాలని వాటిని చూస్తే పూర్తి అవగాహన వస్తుందని వెల్లడించారు. ఈ పది రోజులు సాత్వికమైన ఆహారం మాత్రమే భుజించాలని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలని,  మాంసాహారం తినకపోవడం మంచిదని అన్నారు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని తద్వారా ఆరోగ్యం మనసు రెండు అదుపులో ఉంటాయని అన్నారు. కష్టపడి చదవడం మంచిదే అయినప్పటికీ ఎగ్జామ్స్ పేరుతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు పూర్తిగా మాని చదవడం సరికాదని కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలని అప్పుడే మనసు ఉత్సాహంగా ఉండి చదివింది అంతా గుర్తుంటుందని అన్నారు. పరీక్ష ప్రారంభం అవ్వగానే హడావుడి పడకుండా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవాలని అందులో 100% ఆన్సర్ వచ్చిన ప్రశ్నకి ముందుగా జవాబు రాయాలని తద్వారా సానుకూల దృక్పథం కనబడుతుందని అన్నారు. ఆన్సర్ పేపర్లో మార్జిన్స్ వదిలేసి జవాబులను విడివిడిగా అక్షరాలను చాలా స్పష్టంగా రాయాలని తద్వారా పరీక్షలు అనంతరం పేపర్లను దిద్దే వారికి స్పష్టత ఉంటుందని మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. అర్జునుడు విలువిద్యను నేర్చుకునే సమయంలో గురువు విధించిన లక్ష్యం అయిన పక్షి కన్ను ను మాత్రమే చూశాడని, ప్రస్తుతం విద్యార్థులు సైతం సెల్ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని కేవలం పరీక్షలపై మాత్రమే దృష్టి సారించి చక్కగా చదువుకొని మంచి ఫలితాలను సాధించాలని అన్నారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 99 రకాల పరీక్షలను రాసి ఈ విద్యార్థులు 10 వ తరగతి వరకు ఇంత దూరం రాగలిగారని ఇపుడు రాసేది 100వ పరీక్ష మాత్రమేనని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సమయంలో చదవడం ఒకటే కాకుండా వీలైనంతవరకు పేపర్ పై రాయడం వల్ల సంబంధిత జవాబులు మనోఫలకంలో నిక్షిప్తమై ఉంటాయని అన్నారు. అదేవిధంగా ప్రశ్నలు సమాధానాలపై విద్యార్థులు గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే అవి కూడా ఎప్పటికీ గుర్తు ఉంటాయని తద్వారా ఎగ్జామ్ హాల్లో సులభంగా రాయగలుగుతారని అన్నారు.  సమయపాలన అన్నిటికంటే చాలా విలువైందని ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎగ్జామ్ హాలుకు నిర్నేత సమయాన్ని కన్నా అరగంట ముందే చేరుకునేలా చూసుకోవాలని అన్నారు. పరీక్షల అనంతరం వారం రోజులపాటు ఉత్సాహంగా గడిపి భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పదవ తరగతి తర్వాతనే తమ భవిష్యత్తును నిర్ణయించేందుకు వీలుగా ఇంటర్మీడియట్ ఉంటుందని ఆ దిశగా పరీక్షల తర్వాత మాత్రమే ఆలోచించాలని ఇప్పటినుంచి ఆందోళన చెందరాదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సైతం విద్యార్థులను ఉత్సాహపరిచేలా వారిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వారికి సమయం కేటాయించి మాట్లాడాలని అప్పుడు పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

More articles

Latest article