24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీరో మాల్ డంప్

Must read

📰 Generate e-Paper Clip

. . . సిద్దిపేట్, కరీంనగర్ నుంచి తక్కువ ధరకు పటాకులు తెస్తున్న వ్యాపారులు

. . . పది రెట్ల ధరకు అమ్మకాలకు రంగం సిద్ధం

. . . హోల్ సేల్ వ్యాపారుల సిండికేట్

. . . హోల్ సేలర్లు చెప్పిన ధరలకే రిటైలర్ల అమ్మకాలు

. . .  శివకాశీ నుంచీ దిగుమతైన టపాసులు

నిజామాబాద్, బతుకమ్మ :

దీపావళి పండుగ 10 రోజులు ఉండగానే వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్ ను డంప్ చేశారు. అదీ కూడా ఎక్కడో నగర శివారులో అనుకుంటే పొరపాటే. హోల్ సేల్ వ్యాపారులు కొందరు నగర శివార్లలోని గోదాముల్లో సరుకును డంప్ చేయగా, మరికొంత మంది కిసాన్ గంజ్ పరిసర ప్రాంతాల్లోనే డంప్ చేశారు. టపాసులు జనవాసాల్లో డంప్ చేయడం నిషేధమని తెలిసినా జీరో మాల్ ను గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేసేశారు. జీఎస్టీ చెల్లించిన సరుకు పేరు మీదనే జీరో మాల్ ను రప్పించి నిల్వ చేశారు. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ నగరంలో ఐదారుగురు, కామారెడ్డిలో ఇద్దరు వరకు హోల్ సేల్ వ్యాపారులున్నారు. వారే పెద్ద ఎత్తున టపాకాయలను డంప్ చేశారు. ఇదిలా ఉండగా శివకాశీ నుంచి వస్తున్న సరుకే  కాకుండా పొరుగు జిల్లాలైనా కరీంనగర్, సిద్దిపేట్ నుంచి కూడా తక్కువ ధరకు లభ్యమయ్యే టపాకాయలను తీసుకువచ్చి డంప్ చేశారు. ప్రతి సంవత్సరం అగ్నిమాపక శాఖ పరిమితులకు లోబడి రిటైల్ వ్యాపారానికి అనుమతులు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్ గల్ వంటి మున్సిపల్ ఏరియాల్లో రిటైల్ వ్యాపారానికి అనుమతిస్తారు. అయితే అక్కడి వ్యాపారులకు సరుకు కావాలంటే హోల్ సేల్ వ్యాపారులే దిక్కు. ఈ నేపథ్యంలో హోల్ సేల్ వ్యాపారులు సిండికేట్ గా మారి పెద్ద ఎత్తున సరుకును డంప్ చేసి విక్రయాలకు రంగం సిద్ధం చేశారు. మార్కెట్లో పది రూపాయలకు దొరికే టపాసులను వంద రూపాయలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు.  ఉద్దెర వ్యాపారం కావడంతో హోల్ సేల్ వ్యాపారులు చెప్పిన రేటుకే రిటైల్ వ్యాపారులు అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Zero Mall Dump

సిండికేట్ వ్యాపారం వల్ల టోకు వ్యాపారులకు ఎటొచ్చి లాభాలకు అనుమానాలు లేకున్నా చిల్లర వర్తకులు కూడా ధరలు పెంచితే సామాన్యలకు భారమే. నిజామాబాద్ నగరంలో జీరో మాల్ ను  డంప్ చేసిన వ్యాపారులు రిటైలర్లకు అక్కడి నుంచే సరఫరా చేస్తుండడం విశేషం. అగ్నిమాపక శాఖ టెంపరరీ పర్మిట్లు జారీ చేయకున్నా హోల్ సేల్ వ్యాపారులు మాత్రం అమ్మకాలు చేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖాధికారులు నజర్ వేయకపోవడంతో జీరో మాల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి హోల్ సేల్ వ్యాపారులు గండికొడుతున్నారు. ప్రధానంగా కిసాన్ గంజ్ కేంద్రంగా జీరో మాల్ అమ్మకాల డంప్ వ్యవహారం సాగుతున్నట్లు నిఘా వర్గాలకు మాత్రం సమాచారం ఉన్నా ఇప్పటి వరకు వ్యాపారులపై చర్యలు తీసుకోలేదు. లారీల్లో టోకుగా వస్తున్న సరుకును పట్టుకున్న పాపాన పోలేదు. జీఎస్టీ ఆధారంగా కొనుగోలు చేసిన సరుకు బిల్లులను చూపించి జీరో మాల్ ను సరిహద్దులు దాటించారనే వాదనలున్నాయి. అదే విధంగా హోల్ సేల్ వ్యాపారులు కంపెనీ ఉత్పత్తుల పేరిట జీరోమాల్ మాటున పాత  సరుకును కూడా విక్రయిస్తున్నారని వాదనలున్నాయి. శివకాశీ బదులు అంధ్ర నుంచి కూడా సరుకును తెప్పించి లేబుళ్ళను మాత్రం శివకాశీ పేరిట ముద్రించిన బ్రాండ్ లను విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోట్ల రూపాయల టర్నోవర్ లో పక్షం రోజులపాటు జరిగే దందాకు అగ్నిమాపక శాఖ, పోలీసు , వాణిజ్య సంబంధ శాఖలు సహకరిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్యా వ్యక్తమవుతున్నాయి.

Zero Mall Dump

More articles

Latest article