- దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణం
- వడ్డి వ్యాపారం చేస్తున్న కిలేడి లేడీ కారణమా..?
- జీరో చీట్టీల నిర్వాహకులే కారణమా..?
- ఐపీ పెట్టిన ఆగని వేదింపులు
నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6న గాయత్రినగర్ లో దంపతులు బొలిశెట్టి శ్రీనివాస్, మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొందరు పోలీసుల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో జీరో వడ్డి వ్యాపారం, అధిక వడ్డిపై ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేసినా జీరో వడ్డి, లైసెన్స్ లేని చీట్టీల వ్యవహరం సాగుతుంది. అధిక వడ్డీల పేరుతో తమను వేదిస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఏప్రిల్ మాసంలో నిజామాబాద్ 4వ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గాజుల్ పేట్ కు చెందిన కిలేడి వడ్డీకి అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ వసూల్ చేసుకుని ఇళ్ళు అమ్మిన డబ్బులను చేతిలో పెట్టినా వేదించడం ఆపలేదు. నగరంలోని రేడియో స్టేషన్ ప్రాంతానికి చెందిన జీరో చీట్టీ వ్యాపారి తనకు పోలీసులతో ఉన్న అనుబంధాన్ని సాకుగా చేసుకుని బెదిరించినట్లు తెలిసింది. కామారెడ్డికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకుని రూ.3.50 లక్షలు చెల్లించినా వేదింపులు ఆపలేరని సమాచారం. మొత్తానికి బొలిశెట్టి శ్రీనివాస్, మమత దంపతులు వేదింపులు తట్టుకోలేక ఐపీ పెట్టినా వేదింపులు మాత్రం ఆపలేదని తెలిసింది. గాజుల్ పేట్ కు చెందిన కీలేడి లేడి తాను ఇచ్చిన అప్పు కింద డబ్బులకు అసలు వసూల్ చేసినా వడ్డీ కిందనే లెక్క కట్టినట్లు తెలిసింది. వారి వద్ద మొత్తం సొమ్మును వసూల్ చేసేందుకు ఏకంగా బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. విందులలో, వినోదాలలో పలానా వారు తనకు వడ్డీ మాత్రమే ఇచ్చారని అసలు ఇవ్వలేదని హేళన చేస్తూ వేదించినట్లు తెలిసింది. జీరో చీట్టీల వ్యాపారి తాను పోలీసులకు ఎంత చెబితే అంతా అని ఏకంగా ఇద్దరు దంపతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. అదీ కాకుండా కామారెడ్డికి చెందిన వ్యక్తి రూ.4 లక్షల అప్పుకు రూ.3.50 లక్షలు వసూల్ చేసుకుని తనకు ఇచ్చేది రూ.50 వేలు కాదని మొత్తం రూ.4 లక్షలు ఇవ్వాలని వేదించినట్లు తెలిసింది. తన ఇద్దరు కుమారులు ఉపాధి నిమిత్తం గల్ప్ దేశాలకు వెళ్లారని వారు అప్పు మొత్తాలను చెల్లిస్తారని చెప్పినా వినడం లేదని బాధితులు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే గాజుల్ పేట్ కు చెందిన కీలేడి లేడి తరపున కొందరు , న్యాల్ కల్ రోడ్డుకు చెందిన జీరో చీట్టీ వ్యాపారుల తరపున బాధితులను పోలీసులే బెదిరించినట్లు తెలిసింది. ఐపీ పెట్టినా వడ్డీ వ్యాపారులు జీరో చీట్టీ వ్యాపారుల వేదింపు లు ఆగకపోవడంతో కొత్తగా వచ్చిన పోలీసు కమిషనర్ సాయి చైతన్య ద్వారా తమకు న్యాయం జరుగుతుందనుకున్న దంపతులకు నిరాశ తప్పలేదు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే దానిపై చర్యలు తీసుకోకపోగా దంపతులను బెదిరించి వడ్డీ వ్యపారులు, జీరో చీట్టీ వ్యాపారుల తరపున వకల్తా పుచ్చుకోవడంతో బాధితులు కేవలం రూ.20 లక్షల కోసం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నిజామామాబాద్ జిల్లా కేంద్రంలో జీరో వడ్డీ వ్యాపారం జోరుగా జరుగుతున్న పోలీసు శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిజామాబాద్ కు చెందిన నలుగురు విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ కు చెందిన తండ్రి, కూతురు వడ్డీ వ్యాపారుల వేదింపులు తాళలేక బాసరలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా గాయత్రినగర్ కు చెందిన ఇద్దరు దంపతులు వడ్డీ వ్యాపారుల వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
