నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దక్షిణ గోవా మడగాం లోని శ్రీ దామోదర విద్యాలయ ఇంగ్లీష్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజీళ్ళ జాతీయ ప్రచారకులుగా ప్రసిద్ధి గాంచిన అందె జీవన్ రావు “సూపర్ బ్రెయిన్ యోగ” అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలలో విద్యార్ధులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో “సూపర్ బ్రెయిన్ యోగ” అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందె జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపదుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధనా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్యా పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మక, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపినారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగా గా అభివర్ణించారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతి నిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చునని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

