- భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయి రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఊహ తెలిసిన నాటి నుంచి రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నానని, నా చివరి శ్వాస వరకు రైతు సంక్షేమం కోసమే పని చేస్తానని భారతీయ కిసాన్ సంఘ్ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన కొండల సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. భారతీయ కిసాన్ సంఘ్ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మారుతీ నగర్ లోని గణేష్ భవన్ లో నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన కొండల సాయి రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి రెడ్డి మాట్లాడుతూ కిసాన్ సంఘ్ లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన ఈ మొత్తం ప్రయాణం కేవలం వ్యవసాయం,రైతు మరియు వ్యవసాయ అనుబంధ వ్యవస్థలతోనే ముడి పడిపోయిందని తన జీవితం మొత్తంలో రైతు సంక్షేమ తప్ప వేరే లక్ష్యము ఏదీ లేదని తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కానీ అదే సమయంలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైతు సంస్థగా కిసాన్ సంఘ్ ను నిలబెట్టాల్సిన బాధ్యత తన మీద ఉందని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రము, నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి రైతాంగ సమస్యల గురించి పోరాటం చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడం ద్వారా వెయ్యి మందికి ఉపాధి, పంట మార్పిడి పద్ధతి ద్వారా వేలాది మంది రైతులకు ఉపాధి లభిస్తుందని అందుకోసమే ఆ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించటం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ మాట్లాడుతూ రైతు ద్వారానే సమాజంలో పరివర్తన సాధ్యమవుతుందని భూమిని తల్లిగా భావించి పోషించేది రైతు మాత్రమే అని అందుకే రైతును భగవంతుడితో పోలుస్తారని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ ను నివారించడం ద్వారా భూమి యొక్క సాంద్రతను కాపాడవచ్చని అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని వీలైనంత ఎక్కువమంది ప్రోత్సహించాలని రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆ దిశగా దేశవ్యాప్తంగా ఉన్న నూతన ప్రయోగాలను సాయి రెడ్డి గారి నేతృత్వంలోని కిసాన్ సంఘ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సమాజంలో ఎన్నో వృత్తులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయని పరిస్థితులు, కాలము, ఆధునికత ఎన్ని వచ్చినా వ్యవసాయాన్ని విడిచి ప్రాణికోటి జీవించలేదు కాబట్టి ప్రతి ఒక్కరం వ్యవసాయాన్ని గౌరవించడంతోపాటు భూమిని కాపాడాల్సిన బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సాయి రెడ్డి లాంటి వినమ్రత కలిగిన కార్యకర్తలు, సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసిన కారణంగా అంచలంచలుగా ఎదిగి జాతీయ అధ్యక్షుడు కావటం గర్వకారణం అని తెలిపారు, రైతాంగం యొక్క సమస్యలు మరియు వ్యవసాయంలో వస్తున్న మార్పులను ప్రకృతికి అనుకూలంగా అనుసంధానం చేసే ప్రక్రియను రైతులకు తెలియజేయాలని ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అన్నదాతల శ్రేయస్సును కాపాడాలని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు కె.నారయణ రెడ్డి , డి. వాసుదేవరావు, రైతు ఉత్పత్తిదారుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం దశరథ్ రెడ్డి , నగర అధ్యక్షులు, భారతీయ కిసాన్ సంఘ్, వ్యవసాయ శాఖ అధికారులు, భారతీయ కిసాన్ సంఘ నాయకులు కార్యకర్తలు వివిధ వ్యవసాయ అనుబంధ సంఘాలు,సహకార సంఘాల సభ్యులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.