- కృష్ణమాలకొండరెడ్డి బాధ్యతలు స్వీకరణపై సంశయాలు?
- ప్రమోషన్ వదులుకోవడానికే సుముఖమా?
- నేడు ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరణ
- మళ్లీ ఇంచార్జి పాలనలోనే జీజీహెచ్
- పక్షం రోజుల తర్వాత నియామకాలకు ఉత్తర్వులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి (సూపరింటెండెంట్) కృష్ణమాలకొండరెడ్డి నియమితులై రెండు రోజులు గడిచాయి. కానీ ఆయన విధుల్లో చేరుతారా లేదా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి. ఉస్మానియా మెడికల్ కళాశాలలో కార్డియాలజీ ప్రొఫెసర్ గా ఉన్న డా. కృష్ణమాలకొండరెడ్డిని పదోన్నతిపై వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి కి సూపరింటెండెంట్ గా నియమించిన విషయం విధితమే. అయితే ఆయన ఇప్పటి వరకు విధుల్లో చేరికపై స్పందించకపోవడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చాలా మంది ప్రొఫెసర్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ పదవి అంటే పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాన్నివిధులు నిర్వహించిన వారు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపరనే వాదనలున్నాయి. గతంలోనూ చాలా మంది వైద్యులు నియామకం జరిగిన ప్రమోషన్లు వదులుకున్నారు కానీ చేరలేదు. అదే విధంగా పైరవీలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్ళతో తప్పించుకున్న దాఖలాలున్నాయి. అందుకే దాదాపు దశాబ్ధ కాలంగా జీజీహెచ్ కు ఇంచార్జి సూపరింటెండెంట్ లే దిక్కయ్యారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పదవి స్వీకరణకు హైదరాబాద్ కు చెందిన అధికారులు వెనక్కి తగ్గడానికి స్థానికంగా ప్రాక్టీస్ ఉండడంతో పాటు కుటుంబ సభ్యులు అక్కడే సెటిల్ కావడం కూడా ఒక కారణమే. అసలే ఉన్నత స్థాయి పదవుల్లో ప్రధానంగా ప్రముఖ సీనియర్ వైద్యులుగా ఉన్న వారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలకు ముందుకు రారనే అపవాదు ఉంది. అదే కోణంలోనే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రముఖ కార్డియాలజి ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాలకొండరెడ్డి విధుల్లో చేరుతారా లేదా? అన్నది అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ గా నియమితులైన ప్రొఫెసర్ కృష్ణమోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రికి ఇంచార్జి సూపరింటెండెంట్ పాలన పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికి ఇంచార్జి సూపరింటెండెంట్ గా డా.శ్రీనివాస్ వ్యవహరిస్తుండగా నూతన రెగ్యులర్ సూపరింటెండెంట్ గా నియమితులైన కృష్ణమాలకొండ రెడ్డి బాధ్యతలు స్వీకరణపై ఆసుపత్రి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొన్ని రోజులు ఇంచార్జి పాలన దిక్కయ్యేలా ఉంది.
ఇప్పటికే ప్రమోషన్ వదులుకోవడానికి సిద్దపడడమే కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పదోన్నతులు, బదిలీల ఉత్తర్వుల ప్రకారం విధులలో చేరని నేపథ్యంలో సీనియారిటీ ప్రకారం కొత్త వారికి అవకాశం ఇస్తారని డిపార్ట్ మెంటల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కొత్త సూపరింటెండెంట్ నియామక ప్రకటన వస్తుందని చర్చ జరుగుతుంది.
