. . . వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఘాతుకం
. . . అన్న మరణంపై తమ్ముడికి అనుమానంతో వెలుగు లోకి వచ్చిన కేసు
. . . రిపోస్టుమార్టంతో హత్యగా నిర్ధారణ… ఆరుగురిని అరెస్ట్ చేసిన పొలిసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది భార్య. ఏమి ఎరుగనట్లు భర్త గుండెపోటుతో చనిపోయాడని హడావుడిగా అంత్యక్రియలు చేయించింది. కానీ విదేశాల్లో ఉన్న హతుడి సోదరుడికి తన అన్న మరణంపై అనుమానాలతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టడంతో కేసు కొలిక్కి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఏడాది ప్రారంభంలోనే సంచలనం రేపిన కేసుగా సుపారీ మర్డర్ కేసు నిలిచిందని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఏసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాక్లూర్ మండలం బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్లాటి రమేష్ (35) డిసెంబర్ 20న తన ఇంటి వద్ద గుండెపోటుతో చనిపోయాడు. అయితే రమేష్ సోదరుడు విదేశాల్లో ఉండగా తన అన్న మరణంపై అనుమానం ఉందని తన భార్య అనూషచేత 22న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా డెడ్ బాడిని వెలికితీసి రీపోస్టుమార్టం చేయగా గొంతుపై గాయాలున్నట్లు నిర్ధారణ అయింది. అనుమానంతో మ`తుడి భార్య పల్లాటి సౌమ్య ఆలియాస్ పందుల అరుణలతను విచారించగా తానే తన భర్తను హత్య చేయించినట్లు ఒప్పుకుంది. సౌమ్యకు నందిపేట్ మండలం భాద్గుణకు చెందిన నాళేశ్వర్ దిలీప్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్య సౌమ్య వ్యవహర శైలి విషయంలో రమేష్ గొడవ పడ్డాడు. ఈ విషయంపై ప్రియుడు దిలీప్ తో చర్చించిన సౌమ్య అతన్ని అడ్డు తొలగించుకోవాలని గతేడాది భర్త రమేష్ ను యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించింది. ప్రియుడు దిలీప్ అతని తమ్ముడు అయిన ఎర్రోళ్ళ అభిషేక్ లు కలిసి చిన్నాపూర్ గండివద్ద రమేష్ ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో రమేష్ గాయాలతో బయటపడగా పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు కేసు నమోదు చేశారు. తన భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించిన సౌమ్య ప్రియుడు దిలీప్, అతని తమ్ముడయిన అభిషేక్ లు పథకం రచించారు. సౌమ్య బంగారు రింగ్ ను ఇవ్వగా దానిని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టుపెట్టి రూ.35 వేలు తీసుకువచ్చి మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడైన బంటు జితేందర్ ను దిలీప్ కు అభిషేక్ పరిచయం చేశాడు. బంటు జితేంధర్ ద్వారా వేణు కిసాన్ నగర్ తాండకు చెందిన కేలోత్ శ్రీరాం, రామావత్ రాకేష్ వాళ్ళ స్నేహితుడు మోసిన్ లు కలిసి రూ.35 వేలు పల్లాటిరమేష్ ను చంపాలని నిర్ణయించారు. అడ్వాన్స్ గా డిసెంబర్ 16న రూ.20 వేలు, 19న రూ.15 వేలు ఇచ్చి పథకాన్ని అమలు చేశారు. 19న రాత్రి రమేష్ తన ఇంట్లో భోజనం చేయగా అందులో నిద్రమాత్రలు కలిపిన ఆహారం తిని మత్తులోకి జారుకున్నారు. సౌమ్య దిలీప్ కు ఫోన్ చేసి రమేష్ నిద్రించిన విషయాన్ని తెలిపింది. దిలీప్ సుపారీ తీసుకున్న మిగిలిన వ్యక్తులకు సమాచారం అందించాడు. రమేష్ గాఢనిద్రలో ఉండగా మెడకు టవల్ తో ఉరి వేసి దిండు సహాయంతో ఊపిరి ఆడకుండా చేసి చంపివేసి వెళ్లిపోయారు. 20న ఉదయం సౌమ్య తన భర్త రమేష్ గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించగా అదేరోజు రమేష్ అంత్యక్రియలను నిర్వహించారు. అయితే రమేష్ సోదరుడు తన అన్న మరణంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేయగా రీపోస్టుమార్టం చేసి హతుడు రమేష్ పై గాయాలున్నట్లు గుర్తించి కేసు విచారణ చేపట్టారు. అందులో భాగంగా హత్య కేసులో హతుడి భార్య పల్లాటి సౌమ్య ఆలియాస్ పందుల అరుణలత, నాళేశ్వర్ దిలీప్, ఎర్రోళ్ళ అభిషేక్ లతో పాటు సుపారీ తీసుకుని హత్య పథకాన్ని అమలు చేసిన బంటు జితేంధర్ ఆలియాస్ బబ్లూ, కేలోతో శ్రీరాం, రమావత్ రాకేష్ లను పట్టుకోగా మోసిన్ లు పరారీలో ఉన్నారు. కేసు చేదనకు గట్టిగా క`షి చేసిన నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ లతో పాటు సిబ్బందిని పోలీసు కమిషనర్ సాయిచైతన్య అభినందించారు.

