29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎవరా రెవిన్యూ ఉద్యోగి..?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రిటైర్డ్ ఎంఆర్ఓ చెంతకు ఆర్ఓఆర్ ఫైల్

 

. . . సందేహంతో వెనక్కి..!

 

. . . నందిపేట్ లో ఆలస్యంగా వెలుగులోకి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

పట్టా భూమి, సర్కార్ భూమి అని తెలియదు. అందులో ఇండ్లు కట్టుకున్నారు. బ్యాంకులో అప్పు తీసుకుందామని వెళ్తే భూమికి సంబందించిన ప్రొసీడింగ్ కాపీ కావాలని చెప్పారు. ఈ పని చేసేవాళ్ళు ఎవరా అని ఆరా తీసారు. ఇంకేముంది… రెవిన్యూనే అతలాకుతలం చేసే, అందులోనూ నందిపేట్ మండలంలోని ఉద్యోగియే తారస పడ్డాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఆర్ఓఆర్ కోసం పదిహేను ఏళ్ల క్రితం పనిచేసి విరమణ చేసిన తహసిల్దార్ చెంతకు ఫైల్ పంపించారు. ఆ రెవిన్యూ ఉద్యోగి నిర్వాకం గతం నుంచే తెలిసి ఉండడంతో సందేహం వచ్చి ఆర్ఓఆర్ దస్త్రాన్ని వెనక్కి పంపించారు. ఇదంతా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ..?  విభజనకు ముందు ఉన్న నందిపేట్ మండలంలోని తొండకూర్ గ్రామంలోని సంఘటన.  ఇదంతా నందిపేట్ తహసీల్దార్ సస్పెండ్ కు రెండు రోజుల ముందు.. అందులోని రెవిన్యూ ఉద్యోగి జరిపిన తతంగమిది.

. . . ఆర్ఓఆర్ కోసం

విభజనకు ముందు 2010 -2011 లో  తొండకూర్ గ్రామంలో గల  205, 210 సర్వే నంబర్లలోని మూడు ఎకరాల భూమిలో ఇళ్ళ నిర్మాణం జరిగి,  ఆబాదిలో చేరింది. కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు, నిర్మాణం పూర్తైన వారు బ్యాంకు లో అప్పు అడిగితే ఈ భూమికి గల  ప్రోసిడింగ్ కావాలని సూచించినట్లు తెలిసింది.  దీనికి సంబంధించి రెవిన్యూ ఉద్యోగితో  “మాట్లాడుకున్న తర్వాత”  ఆర్ఓఆర్ కోసం దస్త్రాన్ని సిద్దం చేసారు. దొంకేశ్వర్ మండలంకు చెందిన  దళారి (రెవిన్యూ)తో ఉద్యోగ విరమణ చేసిన తహసిల్దార్ చెంతకు పంపించారు.

. . . ఫైల్ వెనక్కి..!

ఉద్యోగ విరమణ పొంది రెవిన్యూ శాఖకు దూరంగా ఉంటున్న తన చెంతకు ఫైల్ రావడమేంటని పరిపరి విధాలుగా ఆలోచనలో పడ్డాడు.  పంపింది ఎవరనేది తెలుసుకున్న పిదప దస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు.  దీనిపై సంతకం చేసినట్లయితే తానూ ఇరుక్కుంటానని గ్రహించాడు. తన తోటి సహచరులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆర్ఓఆర్ ఫైల్ ను వెనక్కి తిరిగి పంపించినట్లు తెలిసింది. ఆ రెవిన్యూ ఉద్యోగికే పంపిన రెండు రోజుల్లోనే నందిపేట్ తహసీల్దార్ సస్పెండ్ కావడం గమనార్హం.

. . . ఏం మాట్లాడుకున్నారో

విభజన అనంతరం తొండకూర్ గ్రామాన్ని డొంకేశ్వర్  మండలంలో కలిపారు. ఆ గ్రామానికి సంబందించిన వ్యవహారాలుంటే కొత్త మండలానికి చెందిన రెవిన్యూ అధికారులే చేయాల్సి ఉంటుంది. నందిపేట్ మండలంలో విధులు నిర్వహించే కీలక ఉద్యోగి.. ఏం మాట్లాడుకున్నారో గాని  నూతన మండలంలో గల తొండకూర్ గ్రామ వ్యవహారంలో తల దూర్చడం వెనుక పెద్ద ప్రణాళికనే రచించినట్లు తెలుస్తోంది. ఆ  రెవిన్యూ ఉద్యోగి పని చేసిన మండలాల్లో తాను తప్పుడు పనులు చేసి తహసిల్దార్లనే ఇరికించి సస్పెండ్ చేయించాడనే ఆరోపణలు రెవిన్యూ వర్గాల్లో ఇప్పటికి వినబడుతున్నాయి.

More articles

Latest article