- పొలిటికల్ పార్టీల మీటింగ్ లకే పరిమితమా
- సంఘవ్యతిరేక శక్తుల కదలికలపై నిఘా కరువు
- ఎస్ బి, ఇంటిలిజెన్స్ లో ఏళ్ళ తరబడిగా పాతుకపోయిన సిబ్బంది
- రోహింగ్యాలతో పాటు ఇతర రాష్ట్రాల అనుమానితుల సంచారం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఐసీస్ సానుభూతిపరుడిని రెక్కి నిర్వహించి ఎన్ఐఏ అరెస్టు చేసిన ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. పేరుకు సానుభూతిపరుడు అయినప్పటికీ అతని వద్ద తుపాకి దాని తూటాలు లభించడం పోలీసు శాఖను ఆందోళనకు గురి చేసింది. ఎన్ఐఏ నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు తిష్ట వేసి ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించిన ఉదంతం శాంతిభద్రతలను కాపాడడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు ఓఎస్డీ(ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పేరిట ఐపీఎస్ అధికారి పని చేసిన దాఖలలున్నాయి. నక్సలిజం తగ్గుముఖం పట్టాక ఓఎస్డీ పోస్టును తాత్కాలికంగా ఎత్తివేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు సీసీఎస్ లకు ఏసీపీలు పని చేస్తున్నారు. పేరుకు అధికారులు వస్తున్నారు, పోతున్నారు(బదిలీ) అవుతున్నారు కానీ సిబ్బంది మాత్రం మారడం లేదు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సీసీఎస్ లలో పని చేస్తున్న వారు కానిస్టేబుళ్ళుగా చేరి ఏఎస్సైలుగా మొదలుకుని ఎస్సైలుగా పదవి విరమణ చేస్తున్న దాఖలాలున్నాయి. ప్రస్తుతం ఉన్న వారు కూడా ఇతర విభాగాల్లో పని చేస్తూ అటాచ్డ్ గా కొనసాగుతున్నారు.
సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కోసం ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ విభాగాలు అహర్నిశలు పని చేస్తున్నాయి. వారికి అత్యంత అధునాతన సంపత్తి కలిగి ఉంది. చీమ చిట్టుక్కుమన్న పట్టుకునే హైరెజ్యులేషన్ (ఫేస్ రికగ్నైజింగ్) కెమెరాలు ఉన్నాయి. దాదాపు జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా సీసీకెమెరాలు జిల్లా కేంద్రంలోని పోలీసు కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేయబడి ఉన్నాయి. అయితే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్యానం కలిగిన సిబ్బంది, శిక్షణ పొందిన వారు పని చేయాల్సిన చోటా దశాబ్ధాల తరబడిగా ఉన్నా వారే ఉండడంతో నిఘా వ్యవహరాలు అంతగా సక్సెస్ సాధించడం లేదన్న వాదనలున్నాయి. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ లు కేవలం పొలిటికల్ పార్టీల, నాయకుల కార్యకలాపాల గురించి మాత్రమే సమాచారం సేకరిస్తున్నాయని చెప్పాలి. అదీ కూడా స్థానికంగా మీడియాలో వచ్చిన తర్వాతనే బహిర్గతం అవుతుందన్న వాదనలు లేకపోలేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ వారికి 50 శాతం అలవెన్స్ అదనంగా ఇస్తుండగా, ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ వారికి 25 శాతం, స్పెషల్ బ్రాంచ్ లో 15 శాతం అదనపు చెల్లింపులు జరుగుతుంటే నిఘాలో మాత్రం వారి పని శూన్యమని చెప్పాలి. సంబంధిత విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కుర్చీలను వదలడం లేదన్న ఆరోపణలున్నాయి. దశాబ్ధాలుగా పని చేస్తున్న వారిని తప్పించకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదని డిపార్ట్ మెంట్ వారే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొందరు అధికారులు అమ్యామ్యాలు మొదలుకుని అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకుల వద్ద వసూళ్ళకు అధికారుల పేరు చెప్పి తతంగం నడుపుతున్నారనే విమర్శలున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఉగ్రలింకుల వ్యవహరం వెలుగులోకి రావడంతో జిల్లాలో అందుకు గల కారణాలపై చర్చ జరుగుతుంది. అందుకు గల ప్రధాన కారణం నిజామాబాద్ జిల్లాలో రైల్వే లైన్లతో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశాలకు మధ్య ఉన్న ప్రాంతం కావడంతో వలసలే అని చెప్పాలి. ఉపాధి నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికి రోహింగ్యాలు అడ్డా వేశారనేది బహిరంగ రహస్యం. గతంలో బోధన్ నుంచి 32 మందికి బంగ్లాదేశీయులకు పాస్ పోర్టులు ఇవ్వడం వాటి వెనుక స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ప్రమేయం ఉండడం చర్చ జరిగింది. ఇప్పటికి బెంగాలి బంగారు కార్మికులు, మగ్గం వర్క్, విగ్రహాల తయారిలతో పాటు మెషన్ వర్కర్లుగా చెలామణి అవుతున్నారు. వారితో పాటు యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్ కార్మికులు వందల మంది పని చేస్తున్నారు. వారికి బహిరంగంగానే స్థానికంగా ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడీ కార్డులు, ఇతర కార్డులు దక్కించుకుని తిష్ట వేస్తున్నా గుర్తించలేని పరిస్థితిలో నిఘా వ్యవస్థలున్నాయి. కొందరు కుటుంబాలతో సహా వలస వచ్చి ఇక్కడే తిష్ట వేసుకుంటుండగా మరికొంత మంది వివాహ బంధాల పేరుతో ఇక్కడే ఉన్నారని బహిరంగ రహస్యం. కొందరు పాకిస్థానీయులు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారని లెక్కలు చూపుతున్నాయి. కానీ నిఘా వర్గాలు మాత్రం అనుమానితులను, సంఘ వ్యతిరేక శక్తులను పట్టించుకోవడం లేదని వాదనలున్నాయి. ఎన్ఐఏ వచ్చే వరకు జిల్లాలో ఉగ్ర లింకుల గుట్టురట్టు కావడం లేదంటే అందుకు అధికారులు పని తీరే కొలమానంగా చెప్పాలి.