- సన్నబియ్యం పథకం ఒక అద్భుతం
- భూ భారతిని రైతులకు చేరవేయాలి
- సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో 1235మంగళవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం అని ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం అని అన్నారు. భూ భారతిని రైతులకు చేరవేయాలని సూచించారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని, క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని తెలిపారు. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందిగా పరిష్కరించామని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికి సమయం కేటాయిస్తానని తెలిపారు. హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందన్నారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని అన్నారు. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని తెలిపారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని, ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారని, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని తెలిపారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరి,బిక్కిరి అవుతున్నాడని అన్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని, కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందని తెలిపారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయని తెలిపారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్
సీఎల్పీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదని ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అని మండిపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని వీకెండ్ రాజకీయాలు చేయొద్దని అన్నారు. మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుందని మీరు మాట్లాడేదంతా రికార్డవుతుందని అన్నారు.
