- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమర వీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఎస్పబై పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో మార్చి నెలలో గాంధారి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్ రాత్రి విధుల్లో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిపారు. ఏప్రిల్ నెలలో పిట్లం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కె.బుచ్చయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలీస్ సాలరీ ప్యాకేజీ స్కీం కింద ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో అందజేసినట్లు పేర్కొన్నారు. అనుకోని ఘటనల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించేందుకు ఈ ప్యాకెజీ ఎంతగానో సహాయ పడుతుందన్నారు. ఇన్సూరెన్స్ రూపంలో లభించే మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలు, కుటుంబ అవసరాల కోసం సమర్థవంతంగా వినియోగించుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె.నరసింహా రెడ్డి, ఎస్బీఐ బ్యాంకు అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి కె.లింగనాయక్, సూపరింటెండెంట్ ఎస్.కే.జమీల్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ మదుసూదన్, జూనియర్ అసిస్టెంట్ అపూర్వ పాల్గొన్నారు.

