. . . తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు
. . . టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై స్పందిస్తూ.. తాను చేతబడి చేస్తున్నారని ఎప్పుడూ అనలేదని, అయితే కొన్ని ఆలయాల్లో ఆయన ఎలాంటి పూజలు నిర్వహించారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ రైస్ మిల్లులకు సంబంధించిన పెండింగ్ బకాయిల వసూళ్లపై కేబినెట్‌లో తీర్మానం చేశామని తెలిపారు. రైస్ మిల్లుల అక్రమాల విషయంలో తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అక్రమాలపై కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆర్బీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోం దని, ప్రజలు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలను పట్టించుకోకుండా గతంలో పనులు చేపట్టడం కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకే ప్రాజెక్టు పనులు చేపడుతోందని స్పష్టం చేశారు. బీహార్ బంకీపూర్‌లో జరిగిన ఓటమి ప్రధాని మోదీ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేటీఆర్ చేపట్టే పాదయాత్ర వల్ల బీఆర్ఎస్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
