మూసీ రివర్‌ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు తప్పక పూర్తి చేస్తాం

0 14,533

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల సమస్యలు హైదరాబాద్‌కు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో గురువారం నిర్వహించిన వనమహోత్సవం–2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం ఎకోపార్క్‌ లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు. వనమహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అటవీ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన రూ.35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

 

We will definitely complete the Musi Riverfront and Bharat Future City projects.

 

గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకోపార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేస్తాం. సబర్మతి, గంగా, యమునా నదుల రివర్‌ఫ్రంట్‌ల కంటే అద్భుతంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తాంఅని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైందని విమర్శించిన ముఖ్యమంత్రి, ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, గుర్రంగూడ, బైరామల్‌గూడ, సాయబ్‌నగర్ వంటి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలోనే రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. గుర్రంగూడ భూములను కబ్జా చేసే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందని, సుప్రీంకోర్టులో బలంగా వాదించి భూములను రక్షించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో నేషనల్ పార్క్ కోసం 100 ఎకరాలను కేటాయించామని, ఎల్‌బీ నగర్ పరిధిలో 424 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్క్ నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణల కారణంగా గతంలో భారీ వర్షాల సమయంలో అనేక బస్తీలు మునిగిపోయాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెరువులు, పార్కులు, నాలాలను ఆక్రమించే వారిపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించిన ముఖ్యమంత్రి, కొద్దిమంది అక్రమాల వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం సహించబోదని అన్నారు. గతంలో సీరీస్ ఫ్యాక్టరీ కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

We will definitely complete the Musi Riverfront and Bharat Future City projects.

 

Leave A Reply

Your email address will not be published.