- డిప్యూటేషన్ పై పంపిన సారును తిరిగి పాఠశాలకు పంపాలి
- పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ కిషన్ దాస్ పేట పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు బదిలీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై మాట్లాడారు. ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య112 ఉన్నారని, ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 97 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. మిగతా విద్యార్థులు ప్రీ ప్రైమరీ లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు నలుగురు ఉన్నారని ఇప్పుడు డిప్యూటేషన్ పై ఒక ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేయడం వల్ల విద్యార్థులు వారి చదువును నష్టపోతున్నారని వాపోయారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రైవేటు పాఠశాలలో నుండి విద్యార్థులను తీసుకువచ్చి ఈ పాఠశాలలో చదివించడం జరుగుతుందని అన్నారు. ఇటు తల్లిదండ్రుల సంకల్పం, గ్రామస్తుల కృషి , ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థులను చేర్పించినారని ఇప్పుడు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండటం ఇంతమంది విద్యార్థులకు బోధించడం కష్టంగా ఉంటుందని దీంతో విద్యార్థులు తమ చదువులు నష్టపోవడం జరుగుతుందని తల్లిదండ్రులు అన్నారు.గత 12 సంవత్సరాల నుండి విద్యార్థులు లేని ఎంపీపీ ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచుకొని పాఠశాలను బతికించుకుంటున్న తరుణంలో నలుగురు ఉన్న ఉపాధ్యాయులలో ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై పంపించడం వల్ల విద్యార్థులు తమ విద్యను నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ప్లే కార్డుల తో నిరసన వ్యక్తం చేశారు.డిప్యుటీషన్ పై వెళ్లిన ప్రశాంత్ అనే టీచర్ ను మళ్ళీ ఇక్కడకు తీసుకురావాలని అప్పటివరకు మధ్యాహ్న భోజనం చేయమని విద్యార్థులు భీష్మించుకుని కూర్చోగా వారి వారి తల్లిదండ్రులు నచ్చజెప్పగా మధ్యాహ్న భోజనాలు చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, డీఈవో స్పందించి విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా డిప్యుటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయుడిని ఇదే పాఠశాలకు పంపించాలని లేదా వేరే ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని కోరారు.
