. . . న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విద్యార్థులు దేశభక్తి, సామాజిక స్పృహతో ముందుకు వెళ్లాలని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, ప్రణాళిక బద్ధంగా చదువుని కొనసాగించాలని తెలిపారు. ఈ సందర్భంగా సోసైటీ సోల్జర్స్ యూత్ అధ్యక్షుడు మేదర్ శేఖర్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు కంగారు పడకుండా తమ లక్ష్యం వైపు ముందుకు సాగాలని తమ లక్ష్యంలో ఏవైనా అడ్డంకులు వస్తే స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగుతూ లక్ష్యాలను ఛేదించాలన్నారు.

వారి యొక్క ఆదర్శాలను మన జీవితంలో ఇమ్మడింపజేసుకొని మన జీవితాలను మెరుగుపరచుకొని వాటితో పాటు సమాజ సేవా కార్యక్రమంలో కూడా ముందుండాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ బెల్లల్ శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు యూత్ సభ్యులు కుచ్చుల సంజు, దండు చందు, గుడుమల నితిన్ తదితరులు పాల్గొన్నారు.

