27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తినంగా తిన్నాం..  ఇప్పుడేం చేద్దాం..

Must read

📰 Generate e-Paper Clip

  • విజిలెన్స్ దృష్టిలో డెయిరీ టిప్
  •  దొంగ బిల్లుల కోసం వెదుకులాట
  • ఆ ముగ్గురిలో మొదలైన అలజడి 

 

నిజామాబాద్, బతుకమ్మ:  గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది విజయ డెయిరీ అధికారుల పరిస్థితి. టిప్ కు సంబందించిన నిధులను లెక్కలకు చిక్కకుండా మింగారు. ఉన్నతాధికారులను మెప్పించి నీకింత నాకింత అంటూ అందినకాడికి లాగించేశారు. టిప్ (టెక్నికల్ ఇన్ పుట్) లో జరుగుతున్న అవినీతి గురించి “బతుకమ్మ” లో ఈ నెల 2 న ‘డెయిరీ టిప్-దొంగ లెక్కల్లో టాప్’ కథనాన్ని వెలువరించింది. ఈ విషయం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా విజిలెన్స్ చెంతకు వెళ్ళింది. వారు విచారణకు రానున్నారని తెలియగానే టిప్ కుంభకోణంలో సంబంధమున్న ఆ ముగ్గురిలో అలజడి ఆరంభమైంది. తినంగా తిన్నాం – ఇప్పుడేం చేద్దాం అని తలపై చేతులు పెట్టుకొని జరిగిందేదో జరిగింది తప్పించుకునే మార్గం గురించి ఆలోచిద్దామని వారు కుయుక్తులు పడుతున్నారు.

  • విజిలెన్స్ దృష్టిలో టిప్ …

నిజామాబాద్ మిల్క్ షెడ్ లో ఐదేళ్ళు రావణ కాష్టం అఘోరించిందని రైతులు దుమ్మెత్తి పోసిన సంఘటనలు లేకపోలేదు. ఇదంతా ఆ ముగ్గురి వల్లేనని, ఆ సమయంలో  ఏ ఒక్క రైతు షెడ్ వైపు తొంగి చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఇదే అదనుగా భావించిన త్రయో(ముగ్గురు)బృందం లేనిపోనివి రాసుకుంటూ నిధులను నొక్కేశారు. రైతులకు చెందాల్సిన టిప్ నిధులను పక్కదారి పట్టించిన సంఘటనపై ఎండి కఠినంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ కు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇటీవల పక్క జిల్లాకు వచ్చి టిప్ కు సంబందించిన పూర్తి వివరాలను, బిల్లులను ఇవ్వాలని, దీనికిగాను వారం గడువు ఇస్తున్నామని చెప్పి వెళ్లి పోయారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నిజామాబాద్ డెయిరీలో రైతులను ముంచి లాభపడ్డ ముగ్గురికి  వెన్నులో వణుకు మొదలయింది.

  • దొంగ బిల్లుల కోసం ..

తనిఖీ నిమిత్తం వచ్చే విజిలెన్స్ వారు అకస్మాత్తుగా వస్తుంటారు. ఉన్నట్టుండి టిప్ బిల్లులు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలని ఆ త్రయో ముఖం, ముఖాముఖిగా గాకుండా ఫోన్లలో మంతనాలు జరుపుకొన్నారని సమాచారం.  అనలైజర్ లు మరమ్మతులు చేపట్టినప్పుడు  గ్రామంలో, సొసైటీలో విడి భాగాలు కొన్నామని  లిఖిత పూర్వకంగా రైతుల నుంచి రాయించుకోకుండానే రూ.లక్షల్లో బిల్లులు లేపారు.  డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా వారి ఇంట్లో పెళ్లి జరిగితే ఇచ్చే పెళ్లి కానుకలు, సొసైటీకి సంబంధం లేని, తమకు నచ్చిన వారికి ఇచ్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలా ఇచ్చి, ఇలా తిరిగి లాక్కున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలోని యంత్రాలకు మరమ్మతులు చేపడుతున్నామని అనుకూలంగా ఉన్న అధికారుల అంగీకారం అనుమతితో, టిప్ కమిటి తీర్మానం లేకుండా నిధుల భోజ్యం కానిచ్చారు. రైతులకు ఎనలేని సేవలు చేస్తున్నామని బయట వేదికలపై ప్రసంగిస్తూనే, డెయిరీని ఎటూ పాలుపోని విధంగా చేశారనే అపవాదును ఆ త్రయం మూటగట్టుకుంది.

త్రయోష్టయంలో అలజడి..

ఏది కొన్ని రోజులంటే ఇదేనేమో .. ప్రతి దానికి ఒక కాలం వస్తుందంటారు. రైతుల చెమట చుక్కలను కడుపులో సల్ల కదలకుండా డెయిరీలో తిన్న అధికారుల నుంచి కక్కిపించే కాలం వచ్చిందని, అదీ విజిలెన్స్ వారి  తనిఖీతో సాద్యం కానుందని రైతులు సంబరపడుతున్నారు. డెయిరీ ఖాతాలోకి నిధులు రావడంకన్నా పోవడమే ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం షెడ్ లో ఉన్నవారు ఇదే విషయంలో తగవులాడుకుంటున్నట్లు తెలిసింది. మీరే ఎక్కువ భాగం తీసుకొని నాకు తక్కువ ఇచ్చారు, నాకేం సంబంధం లేదని ఒకరిపై ఒకరు నేట్టేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. పంపకాల సంఘతి తర్వాత, ముందుగా విజిలెన్స్ ముందుంచే  బిల్లుల గురించి ఏం చేద్దామని పునరాలోచనలో పడ్డారు. డెయిరీలో ఒకరు అప్పటి బిల్లులను చూసి, స్టోర్ రూమ్ కు పదేపదే వెళ్తూ,  త్రయంలోని ఒకరితో  ఫోన్ లో మాట్లాడుతూ వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసిన లెక్క తూలడం లేదని తెలుస్తోంది.

More articles

Latest article