. . . కేంద్రం ఇవ్వకపోతే మేమే భరిస్తాం
. . . 15-20 రోజుల తర్వాత ఇండ్లకు ఆపిన మొత్తాన్ని విడుదల చేస్తాం
. . . జూన్ 2న రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రారంభం
. . . రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని, కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు రూ.1 లక్షా 13 వేల రూపాయిల వాటా విడుదల కావాల్సి ఉందని కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్ ఆపడం జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశామని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోవైపు ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి 1.60 లక్షల రూపాయిలను తాత్కాలికంగా ఆపామని, ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పధకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడత మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్‌మెంట్ లెవెల్, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న క్యాబినెట్‌లో చర్చించి ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్& రిజిస్ట్రేషన్, సర్వే అంశాలపై విస్తృతంగా చర్చించాం. ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విషయాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించాం. ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించాం. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా ఆదేశించాం. 1/70 సమస్యపై కూడా చర్చించాం. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతాం. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. సుమారు 14.08 కోట్లతో టెండర్ ఖరారు అయింది. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుంది. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈనెల చివరిలోగా భూముల ధరలను సవరించి అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో ఆరునెలలు తిరగకుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచారని అన్నారు.

