24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బీఎల్ఏ ల నియామకం జాబితాను నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అందించాల్సిందిగా రాజకీయ పార్టీలను మరోమారు లిఖితపూర్వకంగా లేఖల ద్వారా కోరాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీ.ఈ.ఓ దృష్టికి తెచ్చారు. గడిచిన వారం రోజుల నుండి ప్రత్యేక చొరవ చూపుతున్న ఫలితంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కూడా మ్యాపింగ్ ప్రక్రియలో ఆశించిన పురోగతి వచ్చిందని, గడువు లోపు మ్యాపింగ్ ను పూర్తి చేసేలా ప్రణాలికాబద్దంగా కృషి చేస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎస్.ఐ.ఆర్ అమలు కోసం ఎన్నికల సంఘం షెడ్యుల్ ను వెలువరించిన నేపధ్యంలో రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి నిర్ణీత ఫార్మాట్ లో వారి వివరాలు సమర్పించేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోందని కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎస్.ఐ.ఆర్ షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలోనైనా బీ.ఎల్.ఓల సత్వర నియామకం ఆవశ్యకత గురించి నొక్కి చెప్పాలని, ప్రతీ వారం ఈ.ఆర్.ఓల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్.ఐ.ఆర్ అమలు తీరు గురించి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో బీ.ఎల్.ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి సహకారం అందించేందుకు వీలుగా వాలంటీర్లను సమకూర్చాలని ఈ.ఆర్.ఓలను ఆదేశించారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల పేర్లు కలిగిన ఓటర్లను మ్యాపింగ్ సందర్భంగా ఖచ్చితంగా గుర్తించేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి అనే దానిపై బీ.ఎల్.ఓలకు శిక్షణ అందించాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ జూన్ 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా ప్రణాలికాబద్దంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో ప్రముఖుల ఓటరు మ్యాపింగ్ పూర్తయ్యిందా లేదా అన్నది ఈ.ఆర్.ఓలు స్వయంగా పరిశీలన జరపాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ అమలు తీరు, ప్రగతి గురించి రోజువారీగా ఆన్లైన్ లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాల వారీగా బీ.ఎల్.ఓల పేరు, ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలను ఓటర్లకు తెలిసేలా విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ముఖ్య కూడళ్ళలో బీ.ఎల్.ఓల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్తింపు కార్డులు లేని బూత్ లెవల్ అధికారులకు క్యూ.ఆర్ కోడ్ తో కూడిన ఐ.డీ కార్డులు  అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా, 6, 7, 8 ఫారాల పెండింగ్ క్లెయిమ్ లను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, ఎస్.ఐ.ఆర్ అమలు కావడానికి ముందే జూన్ 5వ తేదీ లోపు అన్ని క్లెయిమ్ లు పరిష్కారం కావాలని గడువు విధించారు. మ్యాపింగ్ లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా  తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీ.ఆర్.ఓ గీత, నిజామాబాద్ ఆర్.డీ.ఓ రాజేంద్రకుమార్, బాన్సువాడ ఆర్.డీ.ఓ రవీందర్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, సీ.పీ.ఓ రతన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Immediate steps should be taken to recruit booth level agents.

More articles

Latest article