- ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయిబాబా గౌడ్
- వైస్ చైర్మన్ గా జీవన్
నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకం కొలిక్కి వచ్చిన ఆర్మూర్ విషయంలో వచ్చిన పంతాలు, పట్టింపులలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి తాను అనుకున్నట్లు సాయిబాబాగౌడ్ కు చైర్మన్ పదవి ఇప్పించడంలో సఫలమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని అన్నీ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను నియమించిన ఆర్మూర్ కు వచ్చేసరికి సీనియర్లు, జూనియర్లు అంటూ నియామకం విషయంలో అడ్డుకున్న విషయం తెల్సిందే. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సాయిబాబాగౌడ్ నియామకం విషయంలో అనుకూలంగా లేరని వాదనలున్నాయి. వినయ్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు సాయిబాబా గౌడ్ పేరును మార్కెట్ కమిటీ ప్రతిపాదన చేశారు. అయితే ఇస్సాపల్లికి చెందిన జీవన్ పేరును సుదర్శన్ రెడ్డి సిఫారసు చేశారన్న కారణంగా పాలకవర్గం నియామకం గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉంది. ప్రధానంగా మూడు నెలల కాలంగా ఆర్మూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకాలు నిలిచిపోయాయి. బాల్కొండ, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించిన పాలకవర్గాలను నియమించిన తర్వాత గానీ ఆర్మూర్ ఓకే కాలేదని సమాచారం. ఇటీవల నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటించిన తర్వాత ఆర్మూర్ ఏఎంసీ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సాయిబాబా గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు సీనియర్ గా ఉండడంతో ఆయన పేరును అందరూ ఓకే చేసినట్లు తెలిసింది. జీవన్ కూడా సీనియర్ కావడంతో ఆయనకే వైస్ చైర్మన్ పదవి ఖరారు చేసినట్లు తెలిసింది. మిగిలిన డైరెక్టర్ల విషయంలో గతంలో పంపిన పేర్లను మార్చినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో సీనియర్లు కొత్తగా చేరిన వారంటూ విభేదాలు రావడంతోనే డైరెక్టర్ల విషయంలో డైలామా నడిచింది. ఈ నెల 21న డైరెక్టర్ల పేర్లలో ఉన్న గందరగోళానికి జిల్లా, నియోజకవర్గ నాయకత్వం క్లియరెన్స్ చేసినట్లు తెలిసింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండవ స్థానానికి పరిమితమైన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకునేందుకే పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు ఇప్పించాలని వినయ్ రెడ్డి పంతం పట్టి మరీ నెగ్గించుకున్నారని నియోకజవర్గంలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే నియోకజవర్గంలో పెత్తనం కొనసాగిస్తున్నవినయ్ రెడ్డి పార్టీలోనూ తన కోసం పని చేసిన వారిని గుర్తించేందుకు పదవులు కట్టబెట్టారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నకల్లో సత్తా చూపేందుకు స్థానికంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసేందుకే మార్కెట్ కమిటీలో ముందుగా నియామకాలు చేశారని తెలుస్తోంది. ఇవ్వాలో రేపో ఆర్మూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు విషయం ప్రకటన రానుంది.
