28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విజయ పాలు.. కానరావు

Must read

📰 Generate e-Paper Clip

  • తగ్గిపోతున్న బిఎంసిలు
  • రైతులకు ప్రోత్సాహం కరువు
  • నగరంలో కేంద్రాల మాట ఉత్తిదే
  • చైర్మన్ మాటలు పెడచెవిన ..

నిజామాబాద్, బతుకమ్మ: ఉదయం లేవగానే ఏవండీ … పాలు లేవు అలా బజార్ కు వెళ్లి ఒక పాల ప్యాకెట్ తీసుకురండని ఇంట్లో ఆర్డర్. సంచి చేతిలోకి తీసుకొని రోడ్డు ఎక్కాను. స్వతహాగా నేనెప్పుడు పాలు తెచ్చేందుకు వెళ్ళలేదు. దారి వెంబటి అక్కడక్కడ పాల కేంద్రాలు కనబడ్డాయి.. ఇంతలోనే విజయ డయిరీ రాష్ట్ర చైర్మన్ అమిత్ రెడ్డి చెప్పిన మాటలు చెవుల్లో గిర్రున మార్మోగాయి. పక్కనే ఉన్న కేంద్రం దగ్గర ఆగి విజయ పాలు అర లీటర్ ప్యాకెట్ ఒకటివ్వు అని అడిగాను.. అంతే .. భళ్ళున నవ్వాడు …ఏం సార్ ఎప్పుడు పాలు కొనలేదా అని ప్రశ్నించాడు. ఆ పాలు ఎక్కడ దొరకవు. ఒకవేళ తీసుకున్న అవి కొన్ని గంటలే నిలువ ఉంటాయి ..అందుకే ప్రైవేట్ పాలను కొంటారు. ఇవి అయితే వారమైన చెడిపోవని అమ్మకం ధారుడు చెప్పాడు. వద్దులే అని చెప్పి నడుస్తున్నాను గాని ఆలోచనలు పరిపరి విధాలుగా సుడిగుండంల తిరుగుతున్నాయి. ప్రభుత్వాధీనంలో నడుస్తున్న పాలు మార్కెట్లో దొరకకపోవడం ఏంటి .. వీరు అమ్మకాలను పెంచట్లేదా .. లేక ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కయ్యార అనే ప్రశ్నలు మెదులుతుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఇంటి నుంచే కాబోలు అనుకొని ఏదైతే అది అనుకొని ప్రైవేట్ పాల ప్యాకెట్ ను కొనుక్కొని వెనక్కి మళ్ళాను. ఎక్కడోచోట నిత్యం జరుగుతున్న తంతునే ఇది.

విజయ పాలు .. కానరావు..

విజయ పాలు దొరకకపోవడం అనేది ఒక్కరికి జరుగుతున్నది కాదు. ప్రజల్లో అవగాహన ఉన్నవారందరికీ ఎదురవుతున్న సమస్యనే ఇది . పాలు పలుచగా ఉన్న పర్వాలేదుగాని కల్తి ఉండకూడదనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. అలాగని కొందామని దుకాణంలోకి వెళ్లి అడిగితే అవి దొరకవండి అని చెప్తున్నారు. ప్రైవేట్ పాలు ప్రతి కిరాణా దుకాణాల్లో ఉంటే విజయ పాలు ఎందుకు ఉండవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే మార్కెటింగ్ లేకపోతే గ్రామస్థాయిలో విక్రయాలు సాగడం గగనమే అవుతుంది.

తగ్గిపోతున్న బిఎంసిలు..

గతంలో పాల సేకరణ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి అనుకూలంగా బిఎంసి (బల్క్ మిల్క్ చిల్లింగ్) కేంద్రాలను ఏర్పాటు చేసారు. కాలానుగుణంగా వీటిని క్రమేణా తగ్గిస్తున్నారు. మోర్తాడ్, ఆలూర్, బోధన్, వర్నిలలో ఉన్న బిఎంసిలను మూసి వేసారు. ప్రస్తుతం ధర్పల్లి, నవీపేట్, కోటగిరిలలో ఉన్న కేంద్రాలు నడుస్తుండగా, డయిరీ అధికారుల నిర్వాకం వల్ల ఇవి మూత పడేలా ఉన్నాయనే మాటలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాలలో విజయ డయిరీకే పాలు పోసేవారు. ప్రస్తుతం ప్రైవేట్ పాల వ్యాపారస్తులు అదిక పోటిని ఇస్తుండడంతో రోజురోజుకి వీటికి సేకరణ తగ్గిపోతుంది.

రైతులకు ప్రోత్సాహం కరువు..

గేదెలు, ఆవులు ఉన్న రైతులు విజయ డయిరీకి పాలు పోసే విధంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పరంగా వచ్చే గడ్డి విత్తనాలను అందించడమే గాకుండా, పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు గాను పశువులను కొనుగోలు చేయడం కోసం రుణాలను ఇప్పించాల్సి ఉంటుంది. వీటన్నిటిని మరిచిన అధికారులు మెల్లిమెల్లిగా రైతులను ధూరం పెడుతున్నట్లు కనబడుతోంది. గ్రామాలలో విజయ డయిరీకి పాలు తగ్గడం వల్లే బిఎంసిలు ఎత్త్తేస్తున్నారనే ప్రచారం రైతులలో నెలకొంటోంది. ఇదే గనుక జరిగితే డయిరీ ఉనికి ప్రశ్నార్థకం కానుంది.

కానరాని కేంద్రాలు..

పాల విక్రయాల పెంపు కోసం నగరంలో నాలుగు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన డయిరీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు ఎక్కడ కనిపించడం లేదు. కంటేశ్వర్ సమీపంలోని పాలిటెక్నిక్ మైదానం వద్ద, అంగడి బజార్ లో, అర్సపల్లి కమాన్, హమల్ వాడిలో కేంద్రాలను పెట్టిస్తామన్నారు. ప్రధాన కూడళ్ళ వద్ద వీటిని ఏర్పాటు చేస్తే రాకపోకలు సాగించే జనాల దృష్టి పడుతుంది. దీనివల్ల విజయ పాల కొనుగోలుదారులు పెరగనున్నారు.

చైర్మన్ మాటలు పెడచెవిన..

ప్రైవేట్ పాల ప్యాకెట్లలో కల్తి ఉంటుందని, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న విజయ పాలనే వాడాలని ఇటీవల చైర్మన్ చెప్పిన మాటలివి. జిల్లాకు వచ్చిన ఆయన బోధన ఎమ్మేల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ తో కలిసి సారంగాపూర్ లో ఉన్న డయిరీ కేంద్రాన్ని పరిశీలించారు. విజయ పాలను ప్రోత్సహించాలని సంస్థ మనుగడను కాపాడాలని కోరారు. ఇంతవరకు నగరంలో కేంద్రాలను ఏర్పాటు చేయించక పోవడంగాని, కిరాణా దుకాణాల్లో పెట్టించడం గాని చేయలేకపోతున్నారు. దీంతో ఛైర్మెన్ ఆదేశాలను దిక్కరించినట్లే అవుతుందనే అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి.

More articles

Latest article