27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిఫాల్టర్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ డివిజన్ లోని రైసుమిల్లుల్లో సోదాలు
  • 28 బస్తాల ముక్కిన బియ్యం స్వాధీనం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో మరోసారి పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలను ప్రారంభించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ అప్పగించడంలో విఫలమైన వారి మిల్లులలో తనిఖీలకు ఆదేశాలు రావడంతో సోదాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 39 నుంచి 41 రైసుమిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపు 200 కోట్ల బియ్యం ఎఫ్ సిఐకు అందించకపోవడంతో ఆనాడు కేసులు నమోదైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మరోసారి మిల్లులలో తనిఖీలకు అధికారులు ఆదేశాలివ్వడం జరిగింది. 2025-26 వానకాలం సీజన్ కు సంబంధించిన ధాన్యం కేటాయింపులు జరిగిన తర్వాత సోదాలు జరుగడం కలకలం రేపింది. డిఫాల్టర్ కోసమని బుధవారం విజిలెన్స్ చీఫ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం గమనార్హం.

Vigilance checks on defaulter rice mills

  • బోధన్ డివిజన్ లో విజిలెన్స్ తనిఖీలు..

నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని ఎడపల్లి, కోటగిరి, సాలూరా, వర్ని మండలాల్లోని రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్ బృందాలు, టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్నిమండలంలో వసీ రైసుమిల్లులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 25 బస్తాల ముక్కిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత రైసుమిల్లు కూడా డిఫాల్టర్ జాబితాలో ఉండడం గమనార్హం. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మిల్లులు సహా అనుమానిత మిల్లుల్లో నిల్వల స్థితిని సమగ్రంగా పరిశీలించినట్లు సమాచారం. అధికారులు వరుసగా మిల్లులను సందర్శించి సిఎంఆర్‌ (కస్టమ్ మిల్డ్ రైస్‌) నిల్వలపై ప్రత్యేక దృష్టి నిలిపారు. గోదాముల్లో ఉన్న బియ్యం పరిమాణం, రవాణా వివరాలు, స్టాక్‌ రిజిస్టర్లు, హాండింగ్‌ ఓవర్ పత్రాలు తదితర రికార్డులను చెక్ చేశారు. సర్కార్‌కు ఇవ్వాల్సిన బియ్యం నిల్వల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? రిజిస్టర్లలో చూపిన సంఖ్యలకు గోదాముల్లో ఉన్న స్టాక్ సరిపోతుందా? అన్న అంశాలపై అధికారులు ప్రతీ సమాచారాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారని తెలుస్తోంది.

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిఫాల్టర్ రైసుమిల్లులో సోదాలు..

తెలంగాణలో అత్యధికంగా వరిని పండించే జిల్లాలో సేకరణలోనూ ముందుండే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం కొనసాగుతుంది. వందల రైసుమిల్లులు ఉండగా బడాబాబులు, లీడర్లకు సంబంధించిన, అసోసియేషన్ నాయకులకు సంబంధించిన మిల్లుల నుంచే ఎఫ్ సిఐకి సీఎంఆర్ అందలేదు. గత మూడు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగాలు గడువు పెంచుతూ వస్తున్నా మిల్లర్లలో చలనం లేదు. కొన్ని రైసుమిల్లులకు జరిమానా విధింపుతో పాటు రెవెన్యూ రికవరి యాక్టు కేసులు నమోదు చేసినా ఫలితం లేకపోయింది. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి అధికార యంత్రాంగం చర్యలను అడ్డుకుంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బోధన్, నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ లలోనే అత్యధికంగా సీఎంఆర్ డిఫాల్టర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ కేటాయింపులు, రికవరిలో బాధ్యులను అప్పటి అదనపు కలెక్టర్ తో పాటు తహసీల్ధార్లపై కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ రికవరిలో నిర్లక్ష్యం చేశారని నిజామాబాద్ డీఎస్ వో, డీఎంలను బదిలీ చేశారు. అది అలా జరిగినప్పటికీ రికవరిలో ఏ మాత్రం పురోగతి లేకపోవడంతో మరోసారి డిఫాల్టర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు సిద్దమైంది. అందులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Vigilance checks on defaulter rice mills

More articles

Latest article