– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తాండవించింది
– ఆయనవి అర్థంపర్థం లేని మాటలు
– ఏమీ పాలుపోక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు
మోర్తాడ్, బతుకమ్మ : పచ్చ కామెర్లు సోకిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత అవినీతిపరుడైన ప్రశాంత్ రెడ్డి కి వర్తిస్తుందని, ఆయన అవినీతి బకాసురుడని బాల్కొండ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ విమర్శించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తాండవించిందని, ఇప్పుడు ఏమీ పాలుపోక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి పథకంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డారని, ఆఖరకు సీఎంఆర్ఎఫ్కళ్యాణలక్ష్మి లబ్ధిదారులను కూడా బీఆర్ఎస్ నాయకులు వదలలేదని ఆయన ఆరోపించారు.
ప్రజాపాలనలో అంతా ప్రజల నిర్ణయం ప్రకారమే నడుస్తోందని, ప్రజా పాలన గ్రామసభలు ఊరూరా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రజలతో చర్చించి వారి ఆమోదంతోనే ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, అసలైన లబ్ధిదారులకే ఇళ్లు మంజూరు చేశారని అన్నారు.
లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేస్తుందన్నారు. ప్రజా పాలనలో ఎటువంటి అవినీతికి తావులేదని ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు మానుకొని చెంపలు వేసుకోవాలని అన్నారు. ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని ఈసారి దిగుబడి చాలా ఎక్కువగా ఉందని అధికారులు ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించడం లేదని రైతుల నుంచి ఎంత వీలైతే అంత తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని, డబ్బులు జమైన ఐదు రోజుల్లో బోనస్ కూడా వారి ఖాతాల్లో పడుతోందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను కడ్తా పేరుతో నిలువు దోపిడీ చేశారని ప్రశాంత్ రెడ్డికి ఈ విషయంలో కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని సునీల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ది నియంత పాలన అని, కాంగ్రెస్ ది ప్రజాపాలన అని.. ప్రశాంత్ రెడ్డి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
