. . . రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అనవసర గర్భ విచ్ఛిత్తులను అరికట్టాలని, అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా సమానత్వ భావన పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో డీఎం మెట్రో ఛాంబర్‌లో అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాతా-శిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి కనీసం నాలుగు సార్లు వైద్యుల చేత పరీక్షలు నిర్వహించాలని, ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీలకు మరింత ఫాలోఅప్ అవసరమని తెలిపారు. ప్రతి ప్రసవం ఆసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా మాతా-శిశు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రతి నెల 9వ తేదీన ప్రధాన మంత్రి సురక్ష మాత అభియాన్ కింద గర్భిణీలకు సమగ్ర పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహించే “ఆరోగ్య మహిళ” కార్యక్రమంలో మహిళలకు జీవనశైలి వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్, గర్భాశయ సంబంధిత సమస్యలపై పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జాతీయ టీకా కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని, ఒక్క చిన్నారికీ టీకాలు మిస్ కాకుండా డ్యూ లిస్టుల ఆధారంగా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్‌ను 14 ఏళ్ల కిశోర బాలికలకు పూర్తి స్థాయిలో అందించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎంఆర్ వ్యాక్సినేషన్ రెండో డోసు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి ఎన్ఆర్సీలలో చికిత్స అందించాలని, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. వైకల్యాలు ఉన్న పిల్లలను డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లకు రిఫర్ చేయాలని ఆదేశించారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శాశ్వత పద్ధతులపై అవగాహన కల్పిస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ శిబిరాలు నిర్వహించాలని, పీపీఐయూసీడీ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. టిబి ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా మొబైల్ హ్యాండీ ఎక్స్ రే యంత్రాల ద్వారా ప్రతిరోజూ కనీసం 50 ఎక్స్ రేలు నిర్వహించాలని, హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టిబి నిర్ధారణ శిబిరాలు చేపట్టాలని తెలిపారు. జీవనశైలి వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపు, చికిత్సపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, ఫ్లోరోసిస్ కేసులను గుర్తించి చికిత్స అందించాలని, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా రక్త నమూనాల పరీక్షలను పెంచాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య సేవను డిజిటలైజ్ చేసేందుకు జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ దేవీ రాజేశ్వరి, డాక్టర్ అశోక్, డాక్టర్ సికందర్ నాయక్, డాక్టర్ రవీందర్, డాక్టర్ సమతతో పాటు పలువురు ప్రోగ్రామ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
