. . . 24 ఏళ్ల క్రితం తప్పి పోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
. . . కామారెడ్డి పట్టణ పోలీసులు మానవత హృదయానికి హ్యట్సప్ చెప్పిన ఎస్పీ
కామారెడ్డి, బతుకమ్మ :
పాలమూరు జిల్లా నుంచి 24 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం బయలు దేరిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని వదిలి పొట్టకూటి కోసం పట్నం బాట పట్టిన వ్యక్తికి దాదాపు 65 సంవత్సరాలు వచ్చాయి. కానీ భార్య బిడ్డలను, పుట్టిన ఉరును మరిచాడు. దాదాపు రెండు పుష్కర కాలంగా కుటుంబానికి బ్రతికి ఉన్నాడో లేడో, అతడి మంచి చెడ్డల గురించి కూడా తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి అతని కుటుంబ సభ్యులకు పోలీసుల ద్వారా మీ తండ్రి బ్రతికి ఉన్నాడని సమాచారం అందగానే ఉన్నపళంగా వారు అక్కడికి చేరుకుని తమ తండ్రిని చూసిన పిల్లలు ఆశ్చర్యానికి సంబురపడగా తన పిల్లలు చెట్టంతా ఎదిగి ఉండటం చూసి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు.. సత్యనారాయణ (65) అనే వ్యక్తి ది జోగులాంబ గద్వాల్ జిల్లా పూటన్ పల్లి గ్రామం. సత్యనారాయణకు శివశంకర్ , జ్ఞాన చారి (గణేష్) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ చారి 24 సంవత్సరాల క్రితం తప్పిపోయినాడు. ఈ నెల 14న (గురువారం) రాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అశోక్ , హోం గార్డ్ రవి తనిఖీలో భాగంగా సత్యనారాయణ చారి దగ్గర పూర్తి వివరాలను సేకరించారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ వారు సత్య నారాయణ చారీ మిస్సింగ్ వివరాలను గద్వాల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. గద్వాల్ పోలీస్ వారు వివరాలు తెలుసుకొని వారి గ్రామంలో విచారించి వారి గ్రామంలో తప్పిపోయిన విషయం నిజమేనని సత్యనారాయణ అని గుర్తించి కామారెడ్డికి పంపించారు. శుక్రవారం ఉదయం పట్టణ సిఐ నరహరి సమక్షంలో సత్యనారాయణని వారి కుమారులకు అప్పగించారు. ఈ విషయంలో పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి, పిసి కమలాకర్ రెడ్డికి పట్టణ సీఐ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంలో సత్యనారాయణ కుమారులు పట్టణ సిఐ నరహరికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. కామారెడ్డి పట్టణ పోలీసుల మానవత హృదయాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
