27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బాలుడి మర్డర్ కేసు నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసిన బృందానికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

సనత్‌నగర్‌ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని హైదారబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సన్మానించారు. ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ ఉరిశిక్ష తీర్పు మరోసారి నిరూపించిందన్నారు. ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరిక అని పేర్కొన్నారు. ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ ద్వారా ప్రతి కేసును పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా ఉంటామన్నారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘాతుకం సమాజం తలదించుకునేలా చేసిందని, కేవలం రూ.1 లక్ష అప్పు తిరిగి చెల్లించలేదనే కోపంతో, నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడని, తన నివాసంలోనే ఆ పసివాడిని అత్యంత క్రూరంగా గొంతు నులిమి చంపేశాడన్నారు. నేరం చేసిన అనంతరం, నిందితుడు తన స్నేహితుడు రఫీక్ సాయంతో మృతదేహాన్ని ఒక బకెట్‌లో కుక్కి, సాక్ష్యాధారాలు దొరకకుండా సమీపంలోని నాలాలో పడేశాడని, ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ కు ఉరి శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించిందన్నారు. అలాగే కిడ్నాప్ కింద యావజ్జీవ శిక్ష, సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో మరో 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసిందని, రెండో నిందితుడైన మహమ్మద్ రఫీక్‌కు సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు.

More articles

Latest article