కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామంలో ఘటన
కామారెడ్డి, బతుకమ్మ : కుంటలో పడి నీటమునిగి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ (13) అనే కవల పిల్లలు ఉన్నారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ లో వారు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూలు అయిపోయిన అనంతరం ఈత కొట్టడానికి గ్రామ శివారులోని ఒక కుంటలోకి వారు దిగారు. కుంటలో లోతు, నీళ్లు ఎక్కువగా ఉండటం, ఈత రాకపోవడంతో ఇద్దరు నీటమునిగి మరణించారు. దీంతో తిమ్మక్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈమేరకు పిల్లల తండ్రి గుర్రాల పెద్ద నర్సింలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు ఎస్.ఐ బి రంజిత్ తెలిపారు.


