నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన్యం వీరుడు, స్వాతంత్ర్యోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మట్టి లాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు ఉండాలని విదేశీ, పరాయి పెత్తనాలను ధిక్కరించిన ధీశాలి అని అన్నారు. ఆదివాసీ, గిరిజనుల హక్కులను కాలరాస్తున్న నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అల్లూరి స్ఫూర్తితో ప్రతిఘటించాలన్నారు. అడవులపై ఆదివాసులు, గిరిజనులకే హక్కులు ఉండాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. దోపిడీ పీడనలు లేని సమసమాజం కోసం, మతోన్మాదానికి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అల్లూరికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న డి రాజేశ్వర్ జిల్లా నాయకులు లింగం లక్ష్మణ్ రాజేశ్వర్ లక్ష్మీనారాయణ, గంగాధర్ అన్వర్ మల్లేష్ మోహన్ దేవిదాస్ విశ్వనాథ్ ధర్మపురి, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
