నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ల యుద్దోన్మాద దాడులను ఖండిస్తూ, వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ సుప్రీం ఖమేని హత్యను ప్రపంచ దేశాలు ఖండించినా, భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కనీస సంతాప ప్రకటన చేయకపోవడం అమానవీయమన్నారు. అమెరికా సామ్రాజ్యవాద, యుద్దోన్మాద చర్యలను ప్రజలందరూ ఖండించాలన్నారు. మూడవ ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలను ఖండించాలన్నారు. వెంటనే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలన్నారు. గల్ఫ్ దేశాల ఆయిల్ నిక్షేపాలపై అధికారం కోసం, తమ ఆయుధ కంపెనీల వ్యాపారం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా డోనాల్డ్ ట్రంప్ ఘర్షణలు సృష్టించి యుద్ధాలు తీసుకొస్తున్నదన్నారు. అమెరికా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా నాయకులు కే.గంగాధర్ బి.మల్లేష్, బీ.మురళి వివిధ ప్రజాసంఘాల నాయకులు సంధ్యారాణి, గణేష్, సాయిబాబా, సాయరెడ్డి, లక్ష్మణ్, విటల్, మోహన్ , సృజన్, చరణ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
