. . . పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
. . . చౌదరిగూడెంలో తెలంగాణ రక్షణ సేన సభ
మహబూబ్ నగర్, బతుకమ్మ :
తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికే తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరిగూడెం – షాద్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన నేత, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరుకు కృష్ణా జలాలు అందలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులను నిందించామని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు చుక్క నీళ్లు అందలేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులే పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆమె విమర్శించారు. రిజర్వాయర్లు నిర్మించినా కాలువలు నిర్మించకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. జూరాల నుంచి తీసుకోవాల్సిన నీటి సోర్స్ పాయింట్‌ను శ్రీశైలంకు మార్చడం బీఆర్ఎస్ చేసిన “క్షమించరాని తప్పు” అని వ్యాఖ్యానించారు.

లక్ష్మిదేవిపల్లి ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మిస్తే రంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని కవిత తెలిపారు. అయితే బీఆర్ఎస్ చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని ఆరోపించారు.

కమిషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారే తప్ప ప్రజలకు నీళ్లు అందించడం లేదని విమర్శించారు. దసరా నాటికి లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన కవిత, లేనిపక్షంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరుకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, “పాలమూరు బిడ్డలు కాంగ్రెస్‌కు 12 సీట్లు ఇచ్చినా ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోలేదు” అని విమర్శించారు. నీటి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని ప్రజలు క్షమించరని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొత్త ప్రాజెక్టులు పూర్తి కాలేదని కవిత పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో తుమ్మిడిహెట్టి, వార్ధా ప్రాజెక్టులు, వరంగల్‌లో దేవాదుల, నల్గొండలో దిండి వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ అధికంగా వినియోగించుకుంటుండగా తెలంగాణకు సరైన వాటా దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూరాలను సోర్స్ గా తీసుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. నీటి నిర్వహణ కోసం ప్రత్యేక వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చెరువుల్లో నిల్వ నీరు రైతుల పొలాలకు చేరే వరకు పర్యవేక్షించే ప్రత్యేక బృందాలను నియమిస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత, బీజేపీ కూడా తెలంగాణకు న్యాయం చేయడంలో విఫలమైందని విమర్శించారు. అదే విధంగా బీసీ జనగణన, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

