. . . క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలి
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇటీవల ఎస్ఆర్ఎస్ పీ లో యువకుల అకాల మరణం అత్యంత బాధాకరమని, మూడు కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యతని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఆర్ఎస్ పి బ్యాక్‌వాటర్‌లో చోటు చేసుకున్న విషాద ఘటనలో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను నగర మేయర్ ఆదివారం పరామర్శించారు. ముస్లిం వర్గానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మేయర్, బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొని బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సమీ, అబ్దుల్ వహీద్, అబ్దుల్ ఖయ్యూం, షేక్ జాఫర్, షకీల్, వాహద్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పిన మేయర్ కూరగాయల ఉమారాణి మానవీయ స్పందనను స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు అభినందించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని పలువురు పేర్కొన్నారు.

