26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక సమర్పించిన టీఆర్ఎస్ చీఫ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉద్యమకారులకు త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సమావేశమైన ఆమె, ఉద్యమకారులకు న్యాయం చేసే ప్రక్రియలో ఆలస్యం చేయకుండా, సమయపాలనతో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనతో పాటు హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ కు సంబంధించిన నిబంధనలను కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు. ఆ నమూనాలను ఆధారంగా తీసుకుని తెలంగాణ ఉద్యమకారులకు కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఉద్యమకారులతో భుజం భుజం కలిపి పనిచేశానని, గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ అంతర్గత వేదికల్లో ప్రస్తావిస్తూ వారి కోసం పోరాడిన వ్యక్తిని తానేనని కవిత పేర్కొన్నారు. ఆ పోరాటం కారణంగానే బీఆర్ఎస్‌లో తాను రాజకీయంగా నష్టపోయానని అన్నారు. తన సూచనల వల్ల ఉద్యమకారులకు కొంతైనా మేలు జరిగితే అదే తన జీవితానికి సార్థకతగా భావిస్తానని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు నివాళులర్పించిన ఆమె, ఉద్యమంలో ఉన్న భావోద్వేగ అంశాలను చట్టబద్ధమైన నిబంధనలుగా మార్చే బాధ్యత కమిటీపై ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపులో అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను రూపొందించాలని సూచించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని తప్పనిసరిగా గుర్తించాలని, సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలతో ప్రయోజనాలు కల్పించిన విషయాన్ని కమిటీ పరిశీలించాలని కోరారు. ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాలు, సంస్థల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. జాగృతి సంస్థ వద్ద వేలాది మంది ఉద్యమకారుల వివరాలు ఉన్నాయని, కమిటీ కోరితే పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, సంప్రదింపు వివరాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన వారు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్లు నమోదైన వారిని ప్రాధాన్యంతో గుర్తించాలని కవిత సూచించారు. అలాగే మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని, అండర్‌గ్రౌండ్‌లో పనిచేసిన వారు, హౌస్ అరెస్టుకు గురైన వారు, ఆస్తి నష్టం, శారీరక వైకల్యం, పోలీసు దౌర్జన్యాలకు గురైన వారిని కూడా గుర్తింపు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. లాఠీచార్జీల్లో తీవ్రంగా గాయపడిన వారు, ఉద్యమం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు, ప్రభుత్వ చర్యలతో జీవనోపాధి దెబ్బతిన్న వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కమిటీని కోరారు. ఉద్యమకారులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు—భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు—ప్రాధాన్యంగా ప్రయోజనాలు అందేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా పారదర్శక వ్యవస్థను రూపొందించాలని, సహ ఖైదీలు, ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, విద్యావంతుల వేదికల ద్వారా కూడా ధ్రువీకరణ చేపట్టాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు కావడం విచారకరమని కవిత వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు పలుమార్లు ఆందోళనలు చేసిన తర్వాతే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అధికారంలోకి వచ్చిన తేదీ నుంచే ఉద్యమకారులకు అన్ని ప్రయోజనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, అక్కడ మాదిరిగానే తెలంగాణలో కూడా శాశ్వత కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉద్యమకారుల సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. “కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని ఈ కమిటీ తప్పని నిరూపించాలి. నిర్దిష్ట గడువులో ఉద్యమకారులను గుర్తించి, వారికి అందించే ప్రయోజనాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి” అని కవిత విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article