- చతికిలపడ్డ డిచ్ పల్లి డివిజన్ వి”భజన”
- పట్టింపులేని యూనియన్ నాయకులు
- మండిపడుతున్న ఓఅండ్ఎం సిబ్బంది
- ఎస్ఈకి బిజెపి అధ్యక్షుని లేఖాస్త్రం
నిజామాబాద్, బతుకమ్మ: పదవ తేదిన బదిలీ ఉత్తర్వులను ఇస్తామన్నారు. పది రోజులు దాటింది. తీసుకుంటామని ఆశించిన ఓఅండ్ఎం సిబ్బందికి పది రోజులైనా చేతికి అందలేదు. విభజన కోసం ఆగమాగం ప్రకటన జారీ చేసిన అధికారులు అయోమయంలో పడ్డారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఎవరైనా వచ్చి అడిగితే చెప్పడానికి అస్త్రాలను సిద్దం చేసుకున్నారు. వీరి వెనుక ఉండి న్యాయం జరిపించాల్సిన సంఘ నాయకులు మొహం చాటేయడం అధికారులకు కలిసొస్తుంది. అడిగితే క్లారిఫికేషన్ కోసం సిఎండికి రాస్తామని చెప్పడం ఆనవాయితిగా చేస్తున్నారు. తర్వాత వచ్చే వాళ్ళు చూసుకొంటారు తమకెందుకొచ్చిన తంటా అని మిన్నకుండిపోతున్నారు. డివిజన్ విభజనను అధికారులే పరోక్షంగా నిలుపుతున్నారనే విషయం ప్రస్పుటమవుతోంది.
- పది రోజులు దాటినా …
ఈ నెల 10న బదిలీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పి పది రోజులు దాటింది. జిల్లా అధికారి సిబ్బంది విభజన కోసం ప్రకటనను జారి చేయడంతో అనుకున్న ప్రకారం విభజన జరుగుతుందని ఓఅండ్ఎం సిబ్బంది విశ్వసించారు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రొసీడింగ్స్ ఇచ్చిన మాదిరిగా జిల్లా స్థాయి అధికారి సైతం అదే తరహాలో మోసపూరిత ప్రకటనను ఇచ్చారని రోజులు దాటిన తర్వాత సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. విభజన ప్రక్రియకై డిసెంబర్ 23న ఆగమేఘాల మీద ప్రకటనను వెలువరించారు. అప్సన్స్ పరిశీలన అనంతరం జాబితాను ప్రకటించేందుకు తాత్సారం చేయడంతోనే సందేహాలు మొదలయ్యాయి . ఎలాగోలా బయట పెట్టినా .. దానిపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో విభజనను నిలిపేందుకు అధికారులకు షాకులు దొరికినట్లు అయ్యింది.
- పట్టింపులేని నాయకులు…
ఏళ్ళు గడుస్తున్నా డిచ్ పల్లి విభజన ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదనే విషయం సంఘ నాయకులకు తెలుసు. ఓఅండ్ఎం సిబ్బంది కోసం ఖచ్చితంగా డివిజన్ ను ఏర్పాటు చేయించాలనే పట్టింపుగాని, చిత్తశుద్ది గాని నాయకులలో లేనట్లు కనబడుతోంది. సంఘాలను నమ్ముకున్న సిబ్బంది మాత్రం ఆశనిపాతంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కొన్ని సంఘాలు ఉద్యోగ నాయకులకు వంత పాడితే, ఇంకొన్ని యూనియన్లు అధికారుల మాటను శిరసావహిస్తున్నట్లు తెలుస్తోంది. వి”భజన’’ ను కోరుకుంటున్న నాయకుల తీరుతో డివిజన్ విభజన కావడం లేదని ప్రచారం జరుగుతోంది. సంఘ ప్రతినిధుల వైఖరితో ఓఅండ్ఎం సిబ్బంది తీవ్ర స్థాయిలో అసహానం వ్యక్తం చేస్తున్నారు.
- చతికిలపడ్డ విభజన…
డిచ్ పల్లి డివిజన్ విభజన ఏర్పాటు కల కల్లగా మారుతోంది. వినియోగదారుల కోసం రెండేళ్ళ క్రితం మంజూరైనా ..అధికారుల నిస్సహాయత వల్ల విభజన ప్రక్రియ చతికిలబడుతోంది. ఇందులో కొందరి స్వార్థపూరిత ఆలోచనలు మిళితమై ఉండడంతో అవరోధాలు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు కాంపౌండ్ లో వినబడుతున్నాయి.
- ఎస్ఈకి బిజెపి అధ్యక్షుని లేఖాస్త్రం…
డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతున్న దానిపై బిజెపి జిల్లా అద్యక్షుడు దినేష్ కులాచారి ఎస్ఈ కి లేఖాస్త్రం ప్రయోగించినట్లు తెలిసింది. డివిజన్ కార్యాలయాన్ని డిచ్ పల్లి లో గాకుండా పవర్ హౌస్ లో పెట్టడం, ఏళ్ళు గడుస్తున్న సిబ్బంది కేటాయింపు చేయకపోవడంపై ఆయన సందించిన లేఖలో కోరినట్లు సమాచారం. ఎస్ఈ ఇచ్చిన వివరణ ఆధారంగా డిచ్ పల్లి డివిజన్ విభజన కోసం కార్యాచరణను రూపొందించనున్నారని తెలుస్తోంది.
