28.5 C
Hyderabad

సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కస్టడీలో తనను బెదిరించి, దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపణలు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన కస్టడీ సమయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, తనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అభ్యంతరకర పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆయన ఉప్పర్‌పల్లి కోర్టు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసిన అనంతరం పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీలో తనకు ఎదురైన అనుభవాలను ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కస్టడీ సమయంలో విచారణకు వచ్చిన సీపీ సజ్జనార్ తనతో అభ్యంతరకరంగా మాట్లాడారని, తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు ఆయన ఆరోపించినట్లు సమాచారం. తనను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి కొట్టడంతో పాటు వేధింపులకు గురిచేశారని కూడా మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశంలో తనను విచారించారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించినట్లు సమాచారం. విచారణలో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నోటీసులు జారీ చేయాలని ఆయన మేజిస్ట్రేట్‌ను కోరినట్లు తెలుస్తోంది. అలాగే విచారణలో రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు ఎలా పాల్గొంటారని ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించినట్లు సమాచారం. తన న్యాయవాదులను సైతం చంపేస్తామని బెదిరించారని ఉదయ్ కృష్ణారెడ్డి, ఆయన న్యాయవాదులు మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్‌ల జీవితాలను కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఆయన ఆరోపించినట్లు సమాచారం. మేజిస్ట్రేట్ ఎదుట ఉదయ్ కృష్ణారెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మేజిస్ట్రేట్ అందరినీ బయటకు పంపించి, ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం.

. . . అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసు

కస్టడీ విచారణకు సంబంధించి సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశంలో విచారణ ఎలా నిర్వహించారని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌ను మేజిస్ట్రేట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అత్తాపూర్ పోలీసులపై ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ సంబంధిత పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

More articles

Latest article