27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ హత్య కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . శాస్త్రీయ దర్యాప్తుతో నేరస్తుడి అరెస్ట్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణ, సాంకేతిక ఆధారాలు, నిరంతర గాలింపు చర్యలతో ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేశారని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం తన భార్య నర్సాపురం శ్యామల కనిపించడం లేదని మే 31న కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఇద్దరూ కూలి పనుల కోసం కామారెడ్డికి రాగా, భర్తకు పని లభించగా శ్యామలకు పని దొరకలేదు. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి రావాలని చెప్పి రాజం పనికి వెళ్లగా, సాయంత్రం వరకు ఆమె ఇంటికి చేరుకోలేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పాటు బంధువులు, పరిచయస్తుల వద్ద కూడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా అదృశ్య కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో టౌన్ సీఐ బి.నరహరి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా, సమీప జిల్లాల పోలీస్ స్టేషన్లకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు ప్రజా ప్రదేశాల్లో కూడా నోటీసులు ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 2026 జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్యామలగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో పాటు తలపై తీవ్ర గాయాలు ఉండటంతో కేసును హత్యగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించగా, మృతురాలితో కలిసి తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు జూలై 17న కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొదట తన పేరు “మామిడి రాజయ్య”గా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, విచారణలో అతడు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శిరాన్‌పల్లి గ్రామానికి చెందిన పిట్ట నర్సింలు అలియాస్ పిట్టల నర్సింలు అని పోలీసులు నిర్ధారించారు. విచారణలో నేరస్తుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్యామలతో కొంతకాలంగా పరిచయం ఉండేదని, ఆమెకు తరచూ డబ్బులు ఇస్తుండేవాడినని తెలిపాడు. అయితే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అసూయతో గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కకు తీసుకెళ్లి, మద్యం సేవించిన అనంతరం జరిగిన వాగ్వాదంలో రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతురాలి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లి రూ.200 లకు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి, ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. రక్తపు మరకలు పడిన బట్టలను మార్చి సంచిలో దాచిపెట్టినట్లు కూడా నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో నర్సింలు కి గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్లు బయటపడింది. కూలీ కార్మికులతో పరిచయం పెంచుకొని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడినట్లు అతడు ఒప్పుకున్నాడు. నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు, బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో గతంలో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా కేసుల్లో కూడా తన అసలు పేరును దాచిపెట్టి “మామిడి రాజన్న” పేరుతో సంచరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా ఛేదించిన టౌన్ సీఐ బి.నరహరి, ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుళ్లు కమలాకర్, రామస్వామి, సంపత్, రాజులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అధికారుల సమన్వయం, సాంకేతిక దర్యాప్తు, నిరంతర గాలింపు వల్లే కేసును త్వరితగతిన ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేయడం సాధ్యమైందని ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లరాదని, కూలి పనులకు వెళ్లే మహిళలు, పురుషులు తమ కదలికలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

More articles

Latest article