- డీఈవోతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కు నోటీసులు
- సమాదానం ఇచ్చేందుకు విద్యాశాఖాధికారుల తంటాలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని కేజీబీవీల నుంచి టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ కోసం ఎలాంటి టెండర్లు పిలువకుండానే కామారెడ్డికి చెందిన పుస్తకాల సరఫరాదారుకు (ఏజెన్సీ) నిధుల బదిలీ వ్యవహరం జిల్లా విద్యాశాఖాధికారుల మెడకు చుట్టుకుంది. నిధులను ఏజెన్సీకి బదిలీ చేసినా మెటీరియల్ మాత్రం సరఫరా కాకపోవడంతో ఈ వ్యవహరం రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులకు చేరింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఈవోతో పాటు ఆనాటి ఏసీకీ నోటీసులు పంపిన వ్యవహరం వెలుగు చూసింది. ఈ విషయంలో విద్యాశాఖాధికారులు సమాధానం ఇచ్చేందుకు తలలు పట్టుకుంటున్నారు.
దాదాపు మూడు నెలల క్రితం నిజామాబాద్ జిల్లాలోని 27 కస్తూర్భా గాంధీ విద్యాలయాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్లు టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కొరకు దాదాపు 35 లక్షలు నిధులను కామారెడ్డికి చెందిన ఏజెన్సీకి బదులాయించారు. సర్వశిక్షా అబియన్ ద్వారా ఎలాంటి కొనుగోలు జరిగినా రూ.2.5 లక్షలకు మించి జరిగే కొనుగోళ్ళకు టెండర్లను పిలువడం సర్వసాధారణం. కానీ టెండర్లు లేకుండానే కేజీబీవీల నుంచి రూ.90 వేలు 80 వేలు అంటూ ఒకే ఏజెన్సీ నుంచి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కొనుగోలుకు నిధులను మళ్ళించారు. ఆనాడు జీసీడీవో ఆదేశాల మేరకు కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు ఫర్మ్ ద్వారా డబ్బులు చెల్లింపు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏజెన్సీకి డబ్బులను బదిలీ చేసిన తర్వాత సర్వశిక్షా అభియన్ ద్వారానే టీఎల్ఎం సరఫరా చేస్తామని విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సంబంధిత డబ్బులు తిరిగి ఏజెన్సీ వారు వాపస్ చేయకపోవడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ డ్యుకేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా ప్రస్తుత విద్యాశాఖాధికారి అశోక్ తో పాటు ఆనాటి అసిస్టెంట్ కమిషనర్ విజయ్ భాస్కర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన నోటీసులకు సమాదానం చెప్పేందుకు సర్వశిక్షా అభియాన్ సిబ్బంది ద్వారా సమాదానం ఇచ్చేందుకు విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదని తెలిసింది. సాంక్షాన్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నిధులు రిలీవ్ చేశామని అధికారులు చెప్పుకుంటున్నారు. మ్మాచింగ్ ఆర్డర్స్ ను సాకుగా చెప్పుకున్నారు. అయితే ఎస్ వోలు మాత్రం జీసీడీవో వాయిస్ మెస్సెజ్ ద్వారా పలానా ఫర్మ్ కు నిధులను ట్రాన్స్ ఫర్ చేయమంటేనే చేశామని తమకు ఏమి తెలియదని చెప్పడం విశేషం. గతంలో ఏసీగా పనిచేసిన విజయ్ భాస్కర్ రిటైర్డ్ కాగా డిఈవోతో పాటు జీసీడీవో భాగ్యలక్ష్మీలు విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన నోటీసులకు సమాదానం చెప్పేందుకు సమాయత్తం అవుతున్నారు. సర్వశిక్షా అభియాన్ లో పని చేస్తున్న సిబ్బందికి నోటీసులకు సమాదానం చెప్పేంత సామర్థ్యం లేకపోవడంతో విద్యాశాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహరంలో జీసీడీవో మెడకు చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే కేజీబీవీల ఎస్ వోలు అంతా తాము తమపై అధికారి సూచనలు అమలు చేశామని ముక్తకంఠంతో చెబుతుండడంతో ఆమెపై వేటు పడే అవకాశాలున్నాయి.
