నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మాక్లూర్ మండలంలోని మెట్టు, మాధాపూర్, వేణు కిసాన్ నగర్ గ్రామాలలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, అలాగే భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. అలాగే కమ్యూనిటీ లీడర్‌షిప్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత, బాలల రక్షణ, సామాజిక సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. గ్రామ సర్పంచ్‌లు, సంఘ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు సమాజంలో సానుకూల మార్పులకు ముందుండాలని సూచించారు. అదనంగా టి-సేఫ్ ఆప్, సైబర్ క్రైం, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టి-సేఫ్ ఆప్ వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై జాగ్రత్తలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన సహాయం, మహిళలపై వేధింపులను ఎదుర్కొనేందుకు స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న సహాయ సేవలను వివరించారు. మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, భరోసా కో-ఆర్డినేటర్ రోజా, భరోసా డబ్ల్యూఎస్ఐ పుష్పావతి, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.
