. . . ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న జాతర గర్భగుడి దర్శనం కోసం జరిగిన గొడవలో పసిపాప ప్రాణం తీసిన రెడ్డి కులస్తులు 8 మందిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. బుధవారం నగరంలోని దొడ్డి కొమురయ్య నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో భారతదేశంలో మెజార్టీగా వచ్చిన బహుమతులు కుల బహిష్కరణ హత్యలు, దాడులని, మతం పేరిట హత్యలు, దాడులు, మరణాలు తప్ప మరేమీ లేదని అన్నారు. ప్రపంచ దేశాలు టెక్నాలజీ వైపు పరుగెత్తుతుంటే మన దేశం మాత్రం ఎలాంటి మత చిచ్చులు పెట్టాలి, ఎలాంటి కులగజ్జి తో కుల దురంకారం ప్రదర్శిస్తూ కుల బహిష్కరణ చేయాలి, ఏ కులం వారిని కించపరచాలి, ఎవరిని హేళన చేయాలి, ఎవరిని హత్య చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నదని పేర్కొన్నారు. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను హిందువును అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆ పసికందు చనిపోతే ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదని, ఎక్కడైనా చిన్న సమస్య వస్తే మేము హిందువులం అని డబ్బా కొట్టుకునే వాళ్ళందరూ ఈరోజు పసిపాప ప్రాణం పోతే ఎందుకు స్పందించట్లేదో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీళ్లు మతం పేరు పెట్టుకొని బిజెపికి పని చేసే వాళ్లే తప్ప మతంలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే వాళ్ళు కాదని అన్నారు. కులగజ్జితో అహంకారం తలకెక్కి పసిపాప ప్రాణాలు తీసిన 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపాలని, లేకపోతే రానున్న రోజుల్లో చలో కర్నూల్ కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు యశోద, రజియా, సంగీత, శ్రీదేవి పంచ పూల లక్ష్మీ బాయ్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.