. . . ఇంటర్మీడియట్ బోర్డు విలీనంపై అసెంబ్లిలో నే నిర్ణయం
. . . . సీఎం రేవంత్ రెడ్డి
హైదరబాద్, బతుకమ్మ:
రాష్ట్రలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ ఏడాది యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు.ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరకుండా విద్యను నిలిపివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది.ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదికపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.