24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ మనుగడ కోసమే ఈ తతంగం..!

Must read

📰 Generate e-Paper Clip

విగ్రహల మార్పు ఏ చట్టంలో ఉంది..?
మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు..

ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాల మార్పు కార్యక్రమాన్ని చేపట్టిందని బీఆర్ఎస్ నాయకులు మండి పడ్డారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పలువురి మేధావుల సూచనలు, సలహాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పార్టీ మనుగడ కోసమే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు చేయడం ఎంతవరకు సమంజసమని  ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల మార్పు ఏ చట్టంలో ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల పండగ అయిన బతకమ్మ గుర్తులు తొలగించడం ఆడపడుచులను కించపరిచినట్లేనని, దీనిని తెలంగాణలోని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజులలో వారే గుణపాఠం చెబుతారన్నారు. స్వార్థ రాజకీయాలు మానుకొని విగ్రహాలలో మార్పులు ఎత్తిచూపకుండా ప్రజలలో అభివృద్ధి,మార్పు వచ్చేలా ప్రజలకు మేలు చేసేలా పథకాలు ప్రవేశపెట్టాలని హితవు పలికారు.ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోనుందని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా చేసిన తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకొని రాబోయే కాలంలో ఇలాంటి తప్పులకు పాల్పడకుండా ప్రజలకు మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హయాంలో గత పది సంవత్సరాలలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతుబంధు, రైతు బీమా, ఆడపడుచులకు అండగా కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ వంటి అత్యున్నత పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందని గుర్తు చేశారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ఉనికి కోసమే తప్పు సమాచారాలను ప్రజలలోకి తీసుకెళ్తుందని ఇది ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకొని ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, మండల అధ్యక్షులు చిలివేరి దాస్, ఉపాధ్యక్షులు శెట్టి బీరిష్,మండల సీనియర్ నాయకులు రఘు, నామాల గంగాధర్,తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article