. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
హైదరాబాద్, బతుకమ్మ :
వైరల్‌గా మారిన ఆడియో క్లిప్ వివాదంపై మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. తన పేరుతో ప్రచారంలో ఉన్న ఆడియోలోని స్వరం తనది కాదని, అది పూర్తిగా ఫేక్ ఆడియో క్లిప్ అని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కుట్రపూరితంగా ఈ ఆడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంటూ, ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరడానికి ముందుగానే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని వదిలిపెట్టబోనని, అసలు కుట్రదారులను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తానని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తనకు సోదరుడిలాంటి వ్యక్తి అని, ఆయన గురించి ఎక్కడా అవమానకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు కావాలనే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే తాను గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎప్పుడూ చేయనని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. షబ్బీర్ అలీ బెంగళూరులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ కార్గే ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.

