. . . అక్రమ సంపాదన తగ్గించండి
. . . రాబోయే రోజుల్లో నోట్లకు ట్రాకింగ్
. . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, బతుకమ్మ :
మోడీ ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసిన కాలంలో అవినీతికి, అక్రమాలకు తావు లేదని ఆయన మచ్చలేని నాయకుడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమైందని, ఉగ్రవాదాన్ని దేశసరిహద్దుకే పరిమితం చేశారని గుర్తు చేశారు. నాయకులు అక్రమ సంపాదన తగ్గించండని సూచించారు. తెలంగాణాలో రైల్వే బ్రిడ్జి లు, స్టేషన్లు, రోడ్ల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా జాతీయ రహదారుల విస్తరణతో పాటు రైల్వే లైన్ ల ఆధునీకరణ, డబ్లింగ్ పనులు అందులో భాగమేనని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. కమిషన్లు వచ్చే పనులే చేస్తున్నారని, సీఎం సహా మంత్రులంతా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశంలో కమ్యూనిస్టు కనుమరుగయిందని దాని సంకేతంగా ఇటీవల జరిగిన కేరళ మొదలుకుని పశ్చిమబెంగాల్ వరకు వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7700 కోట్ల తో జాతీయ రహదారి డెవలప్ మెంట్ జరుగుతుందని, 44, 63 నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయన్నారు. మన దేశంపై యుద్ధ ప్రభావం తక్కువ అని అన్నారు. యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే యాప్ ను రద్దు చేసి పాత విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

