వెబ్ న్యూస్, బతుకమ్మ : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ చోరీ గురించి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశ్వక్ కుటుంబమంతా ఒకే ఇంట్లో నివాసముంటుండగా.. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంది. ఆదివారం తెల్లవారుజామున తన గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉండడం గమనించిన వన్మయి అనుమానం వచ్చి, అల్మారాలను తనిఖీ చేయగా అందులో ఉన్న బంగారం చోరీకి గురైనట్లు గుర్తించింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పగా, కరాటే రాజు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. అలాగే ఇంటి చుట్టూపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.