30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నీట్ పరీక్ష లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీవీయువీ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నీట్ పరీక్ష లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టీవీయువీ) జిల్లా అధ్యక్షుడు రాంపూర్ అజయ్ డిమాండ్ చేశారు. టీవీయూవీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) పేరుతో విద్యను కేంద్రీకరించడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్లే ఇలాంటి ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ)ను రద్దు చేసి, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలకు అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం, నిరసనకారులపై బలప్రయోగానికి దిగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. లాఠీచార్జ్‌కు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాంపూర్ అజయ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో టీవీయూవీ నగర అధ్యక్షుడు సుభాష్‌తో పాటు నాయకులు చంద్రకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article