రుద్రూర్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాల సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బి. మల్లేష్ మాట్లాడుతూ.. బీడి పరిశ్రమలో బీడి వర్కర్ గా పని చేస్తున్నా బీడీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా చేతినిండా పని దొరకడం లేదని, ప్రతి రోజు సగం పని, నెలకు 8 నుండి 12 రోజుల లోపు మాత్రమే పని దొరుకుతుందని అన్నారు. దీనికి తోడు వేతనాలు కూడా అతి తక్కువగా ఉన్నాయని, దీని వలన బీడి కార్మికుల కుటుంబం గడవడం, బ్రతకడం తలకు మించిన భారమవుతుందన్నారు. పని చేయడానికి ఉత్పత్తి పెంచాలని, పని దినాలు పెంచాలని అనేక సార్లు బీడి యాజమాన్యంతో గొడవ పడిన కూడా పరిష్కారం కాలేదన్నారు. అందువలన తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి బీడి వర్కర్ ను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. బీడి పరిశ్రమలో పని చేస్తున్న అన్ని క్యాటగిరీలకు చెందిన వారికి ఇప్పటికే ప్రతినెల 2016/- రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీడీ కార్మికులకు చేయూత పథకం క్రింద ప్రతి నెల 4000/- రూపాయలు ఇస్తామని ప్రకటించారని, ఎన్నికలు జరిగిన తమరు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కావస్తున్న నేటికి అమలు చేయలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున అతి తక్కువ కూలీలు పొందుతున్న బీడి కార్మికులకు చేదోడు వాదోడు ఆసరాగా ఉండటానికి చేయూత పథకం క్రింద మాకు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేకుండా ప్రతి నెల 4000/- రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.