. . . భీంగల్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
. . . డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి
భీంగల్, బతుకమ్మ :
ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిందని గుర్తించిన ఆయన శుక్రవారం పట్టణాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా భీంగల్ పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించి, బూత్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో నాగేష్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా కాంగ్రెస్ నాయకులు, బూత్ కమిటీలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ అంశాలపై స్పందించిన నాగేష్ రెడ్డి, గత పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భీంగల్ పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి రూ.500 కోట్ల నిధులపై చూపిన శ్రద్ధ భీంగల్ పట్టణ అభివృద్ధిపై చూపి ఉంటే పట్టణం ఎప్పుడో అభివృద్ధి చెందేదని వ్యాఖ్యానించారు. భీంగల్ 100 పడకల ఆసుపత్రికి సంబంధించి రూ.3 కోట్ల బిల్లులు విడుదల చేయించడం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృషి ఫలితమని తెలిపారు. అలాగే లింబాద్రి గుట్ట అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు ముఖ్యంగా భీంగల్ పట్టణ కేంద్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నాగేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేపట్టిన దీక్షపై విమర్శలు చేస్తూ, అది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత్ రావు, భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జనార్దన్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, డిచ్‌పల్లి మాజీ ఎంపీపీ నర్సయ్య, కౌన్సిలర్లు శ్రీజ నాగేంద్ర, సతీష్, సంగే నాయక్, అంజుమ్, సందీప్, యూత్ కాంగ్రెస్ నాయకులు వాకా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
