. . . సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బీఆర్ టియు ఆధ్వర్యంలో నగరంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్న ఆశ వర్కర్ల సమ్మెకు సోమవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆశ వర్కర్ల జీతాలను రూ.18,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కే సీ ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఆశ వర్కర్ల జీతాలను 2,200 నుంచి 9,750 వరకు పెంచారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి మహిళా దినోత్సవం సందర్భంగా ఆశ వర్కర్లకు చీరలు, భోజనాలతో గౌరవంగా సన్మానం చేసిన విషయాన్ని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆశ వర్కర్లను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆశ వర్కర్లను సర్వేలు, ఇతర కార్యక్రమాలకు వినియోగించు కుంటూ, వారి శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఆశ వర్కర్ల జీతాలను తక్షణమే 18,000కు పెంచాలని,వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆశ వర్కర్లు పిలుపునిచ్చే ప్రతి ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

