. . . ఐఅండ్ పీఆర్ కమీషనరేట్ ముట్టడి
. . . వివక్ష వీడకపోతే రాష్ట్రవ్యాపిత ఆందోళన
హైదరాబాద్, బతుకమ్మ :
జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమీషనర్ కార్యాలయం (సమాచార భవన్)ను ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల “ఛలో హైదరాబాద్” కార్యక్రమం పిలుపు మేరకు బుధవారం వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఅండ్ పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేదని, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా, నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేదని, హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసే లేదని, సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుకుంటుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో జర్నలిస్టులకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వివక్ష చూపుతూ, నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జర్నలిస్టుల చైతన్య యాత్రతో ప్రజల్లోకి వెళతామని మామిడి సోమయ్య హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐఅండ్ పిఆర్ డైరెక్టర్ కిషోర్ బాబు కు అందజేశారు.

