ధర్మపురి హిల్స్ సర్కార్ భూమి కబ్జా పై కదిలిన యంత్రాంగం

0 99,705
  • పరిశీలించిన రెవెన్యూ అధికారులు
  • కబ్జాపై ఆర్డీవోకు నివేదిక
  • సర్కారు భూమిలో బండరాళ్ళ పేల్చివేతపై పోలీసుల ఫిర్యాదు

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ లో 249 సర్వే నంబర్ లో సర్కార్ భూమి కబ్జాపై అధికారుల యంత్రాంగం కదిలింది. నిజామాబాద్ నార్త్ మండలం రెవెన్యూ అధికారులు ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ సర్వేయర్లతో కలిసి భూమిని పరిశీలించారు. గతంలో అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు కబరస్తాన్ పక్కనే ఉన్న సర్కారు భూమిలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించింది వాస్తవమేనని గుర్తించారు. అదే విధంగా అక్కడ భూమిని చదును చేసినట్లు తేల్చారు. సర్కారు భూమిలో ఉన్న బండరాళ్ళను జిలిటెన్ స్టిక్ లతో పగులగొట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు నిజామాబాద్ ఆర్డీవోకు ఓ నివేదిక సమర్పించినట్లు నార్త్ తహసీల్ధార్ నాగార్జున తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జా కోసం కబ్జాదారులు దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. స్మశాన వాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు అందులో ఉన్న బండరాళ్ళను పేలుడు పదార్థాలతో పేల్చివేయడం జరిగిన తీరు భయబ్రాంతులకు గురి చేసింది. గురువారం వరకు మైనార్టీల బొందలగడ్డ ప్రక్కన ఉన్న తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షీయల్ గురుకుల పాఠశాలలో వందల మంది విద్యార్థులు ఉండగానే కబ్జాదారులు పేలుడు పదార్థాలు ఉపయోగించిన తీరు ఆందోళన కలిగించింది. చిన్న పొరపాటు జరిగిన విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా ఉన్నప్పటికీ ఏకంగా కబ్జా కోసం నిషేదిత పేలుడు పదార్థాలను వాడడం, దానికి పోలీసుల అనుమతులు లేకుండానే వాడడం పై ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా అటవి ప్రాంతంలో కబ్జాల కోసం జేసీబీలు, ట్రాక్టర్ లతో కబ్జాలు చేయడం సాధారణమైనప్పటికీ ఏకంగా పేలుడు పదార్థాలను వాడడం వెనుక ఉన్న గ్యాంగ్ కు పోలీసులతో సంబంధాలున్నాయని అందుకే అక్కడ పేలుడు పదార్థాలను వాడిన ఇంత వరుకు గుర్తించలేదన్న వాదనలు ఉన్నాయి.
మైనార్టీ ప్రాంతంలో అటవి, సర్కారు భూములు, పేదలకు ఇచ్చిన ఇళ్ళను కబ్జా చేసే గ్యాంగ్ లకు కొదవ లేదు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అండతో రౌడి షీటర్లు, కబ్జారాయుళ్లు 10, 11, 12 డివిజన్ లలో కబ్జాలకు తెగబడుతున్నారు. గడిచిన 15 నెలల కాలంలోనే హద్దులు చెరిపివేసి కబ్జాలకు దిగుతున్నారు. స్థానిక 5, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులలో షీట్లు తెరిచిన వారు రౌడీ షీటర్లు స్థానికులకు భయబ్రాంతులకు గురి చేసి కబ్జా దందాలకు తెర లేపారు. వారికి స్థానిక పోలీసుల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే కబ్జాలకు బరితెగించారన్న వాదనలున్నాయి. భూములు ఒక చోట, కబ్జాలు ఒక చోట చందంగా పరిస్థితి ఉంది. శివారు ప్రాంతాలకు అధికారులు రారని ధీమాతో వారు రెచ్చిపోతున్నారు. ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జాలో ఆ ప్రాంతంలో గ్యాంగ్ లు నడిపే రౌడిషీటరే ప్రధానపాత్ర పోశించినట్లు స్థానికులు రెవెన్యూ అధికారుల సమక్షంలో నేరుగా ఫిర్యాదు చేశారు. కానీ వారి గురించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారా, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే విషయం సందేహాస్పాదంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.